నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా నెల్లికల్‌లో ఎత్తిపోథల పథకాలకు శంకుస్ధాపన చేశారు సీఎం కేసీఆర్. అనంతరం స్ధానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
కృష్ణానది వెంట ఉండే దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని భూములను సస్యశ్యామలం చేసేందుకు నెల్లికల్ ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.2,395.68 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు పలుచోట్ల ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,04,600 ఎకరాల టెయిల్‌లాండ్ భూములకు సాగునీరు అందించేందుకు 13 లిఫ్ట్ ఇరిగినేషన్ ప్రాజెక్టులను చేపడుతున్నారు.
అంతకముందు బేగంపేట నుండి నందికొండకు చేరుకున్న సీఎంకు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలు ఘనస్వాగతం పలికారు. నందికొండ నుంచి రోడ్డుమార్గాన నెల్లికల్‌కు చేరుకుని 13 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 3:10 గంటలకు హాలియా బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు.