- Advertisement -
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో గొల్ల, కురుమల భవనాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గొల్ల, కురుమల సంక్షేమ, భవనాలు సంక్షేమ సదనాలు కావాలని ఆకాక్షించారు. ఐకమత్యమే మనందరికి బలమని, మనదగ్గర ఐకమత్యం లేకపోవడం వలనే వెనుకబడి ఉన్నామని అన్నారు. భారతదేశానికి తెలంగాణ దిక్సూచి కావాలని సీఎం కేసీఆర్ ఆకాక్షించారు. గొల్లకురుమల అనాథలకు ఇక్కడ అన్నం దొరుకుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.
తాను ముఖ్యమంత్రి అయిన కొత్తలో తెలంగాణలో పరిస్థితి దారుణంగా ఉండేదని, హైదరాబాద్ కు ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెల మాంసం, చేపలు దిగుమతి అయ్యేవని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది గొల్లకురుమలు ఉన్నారని, వారికి గొర్రెలు ఇస్తామన్నప్పుడు ప్రతిపక్షాలు అడ్డగొలు మాటలు మాట్లాడారని, తాను చేయగలనన్న నమ్మకంతో ముందుకెళ్లానని ఇప్పుడు అదే నమ్మకం సత్పలితాన్నిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో గొల్ల కురుమలకు 35 లక్షల గొర్రెలను పంచామని అన్నారు. ఆ గొర్రెలు 13 లక్షల గొర్రె పిల్లలను పెట్టాయని సీఎం కేసీఆర్ అన్నారు. గొల్ల కురుమల సంక్షేమానికి కోటీ రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. గొర్రెల వైద్యానికి ఆంబులెన్సులను అందించే ఆలోచన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందించారని సీఎం కేసీఆర్ అన్నారు.
రాబోయే నాలుగేళ్లలో గొల్లకురుమలు దేశంలోనే ధనికులుగా మారుతారని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం ఆలోచన మంత్రి ఈటెల రాజేందర్ ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో గొల్లకురుమలకు అందించిన గొర్రెలను అమ్ముతున్నారన్న వార్తలు వస్తున్నాయని, వీటిని అడ్డుకునేందుకు సంఘం నాయకులు చొరవచూపాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని అన్ని మీట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని, అందుకు రుణాలను మంజూరు చేస్తామని అన్నారు. అటవీ భూముల్లో గొర్రెలను మేపుకోవచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. సంక్షేమం రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, పేదింటి ఆడపిల్ల పెళ్లికి కల్యాణ లక్ష్మి పథకంతో 75వేల రూపాయలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ కిట్, నిరంతర విద్యుత్, జీవన భృతి వంటి అనేక రకాల పథకాలను తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి అందిస్తున్న పథకాన్ని చూసి కేంద్రమంత్రి రాజ్ నాథ్ షాక్ అయ్యారని, తనను కేంద్ర రాజకీయాల్లోకి వస్తున్నారా అని అడిగారని, తనకు కేంద్ర రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణకు బాటలు మొదలు పెట్టామని, మరమగ్గాలకు సబ్సిడీ ఇచ్చామని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమం దేశంలో ఎక్కడా ఉండవని కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఇది సాధ్యమవుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. అంతకు ముందు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జోగు రామన్న, మహేందర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -