కోనాయిపల్లి.. కేసీఆర్.. ఏంటి కథ?

247
kcr konaipalli
- Advertisement -

34 ఏళ్ల రాజకీయ ప్రస్ధానంలో తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు సీఎం కేసీఆర్. కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా వాటినన్నింటిని తట్టుకుని నిలబడ్డారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం మొదలుకుని బంగారు తెలంగాణ స్ధాపనలోనూ కేసీఆర్ అదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారు. ఇక్కడి వేంకటేశ్వరాలయంలో పూజలు చేస్తే శుభం జరుగుతుందని నమ్మే కేసీఆర్‌.. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ స్వామివారి పాదాల చెంత నామినేషన్‌ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఎమ్మెల్యేగా ఎన్నికైతే గుడికి వచ్చి పూజలు చేస్తానని 1985లో కేసీఆర్‌ మొక్కిన మొక్కు నెరవేరడంతో సుదీర్ఘ కాలంగా అదే నమ్మకాన్ని ఫాలో అవుతున్నారు. 1985 నుంచి 2018 వరకు జరిగిన ప్రతీ ఎన్నికల్లో నామినేష్‌ పత్రాలను తొలుత వెంకన్న పాదాల చెంత ఉంచి అనంతరం నామినేషన్ దాఖలు చేస్తూ విజయం సాధిస్తూ వస్తున్నారు. 2001లో వెంకన్న ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్‌లోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని సంవత్సరాల్లోనే టీఆర్‌ఎస్‌ పార్టీకి గుర్తింపు రావడం,ప్రజల మన్ననలు పొందడంతో పాటు తెలంగాణ రాష్ట్రం అవతరించడం, తొలిసీఎంగా బాధ్యతలు చేపట్టారు.

తాజాగా కరీంనగర్ నుండి పార్లమెంట్ ఎన్నికల శంఖారావన్ని పూరించనున్న సీఎం…తనకు అచ్చొచ్చిన కోనాయిపల్లేలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బహిరంగసభాస్ధలికి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పలుమార్లు కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకున్నారు కేసీఆర్.

నంగునూరు మండలంలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి విశిష్ట చరిత్ర ఉంది. ఐదు దశాబ్దాలక్రితం కోనాయిపల్లి గ్రామానికి చెందిన గూడెపు ఎల్లారెడ్డి అనేవ్యక్తికి వేంకటేశ్వరస్వామి కలలో కనిపించి, దీర్ఘరోగాల నివారణకు చెట్టు మందును చెప్పాడని గ్రామస్థులు పేర్కొంటుంటారు. స్వామి ఆజ్ఞ మేరకు ఎల్లారెడ్డి తెల్లవారుజామున అడవికి వెళ్లి, చెట్ల మందును తీసుకువచ్చి పోయడం ప్రారంభించారు. రోగాలు నయమవుతుండటంతో చెట్లమందుకు ఆదరణ పెరిగింది. అప్పటినుంచి ఏటా మాఘమాసంలో స్వామివారికి వార్షికోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

- Advertisement -