యాదాద్రి దేవాలయ పున సంప్రోక్షణకు స్టాలిన్ కు ఆహ్వానం

106
kcr
- Advertisement -

యాదాద్రి దేవాలయ పున ప్రారంభ వేడుకలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను తెలంగాణా సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నారు. పున సంప్రోక్షణ జరిగే వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకోవాలని సీఎం కేసీఆర్, స్టాలిన్ను కోరనున్నారు. ఫెడరల్ రాజకీయాల చర్చ మరోసారి జోరుగా సాగుతున్న తరుణంలో మంగళవారం జరగనున్న తెలంగాణా, తమిళనాడు ముఖ్యమంత్రుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ రాజకీయాలతో పాటు, రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, అది సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్న వైనాలపై ఇద్దరు దృష్టిసారించే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతలో తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మిస్తున్న యాదాద్రి క్షేత్ర పున సంప్రోక్షణ కార్యక్రమాలు వారం రోజుల పాటు జరగనున్నాయి. అవి మార్చి 22 వ తేదీన సుదర్శన యాగంతో ప్రారంభమై 28 వ తేదీ అర్ధరాత్రి ముగుస్తాయి. 29 వ తేదీ తెల్లవారుజాము నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం సందర్శకులను అనుమతిస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగే పున ప్రారంభ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి అతిథులు హాజరుకానున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ మధ్యనే ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా యాదాద్రి పుణ్యక్షేత్రం పున సంప్రోక్షణకు ఆహ్వానించారు. దేశ వ్యాప్తంగా ప్రముఖులను ముఖ్యులను స్వయంగా తానే కలిసి యాదాద్రి పున ప్రారంభ వేడుకలకు ఆహ్వానిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే భేటీలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి వేడుకలకు ఆహ్వానించనున్నారు.

ఇక చెన్నై ఆళ్వారుపేటలోని చిత్తరంజన్ రోడ్డులోని స్టాలిన్ నివాసంలో ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ భేటీలో పలు రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్న వైనం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న రైతు వ్యతిరేక విధానాలు, కొత్త విద్యుత్ చట్టాల్లోని లొసుగులపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డీఎంకే అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలవడం ఇదే మొదటిసారి. గతంలో 2019 లో అప్పట్లో డీఎంకే చీఫ్ గా ఉన్న స్టాలిన్ ను కేసీఆర్ కలిశారు. వయోధిక వృద్ధుడు డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధిని కూడా సీఎం కేసీఆర్ పరామర్శించారు.

- Advertisement -