కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలనలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం రాత్రి కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో బస చేశారు. బుధవారం ఉదయం ప్రాజెక్టుల సందర్శనకు బయలు దేరి వెళ్లే ముందు అధికారులు, అనధికారులు, ప్రజలను సిఎం కేసీఆర్ కలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెండో రోజు పర్యటన కన్నేపల్లి పంపుహౌస్ గ్రావిటీ కెనాల్ నుంచి ప్రారంభించారు. కన్నేపల్లి, అన్నారం వరకు నిర్మిస్తున్న 13.2 కి.మీ గ్రావిటీ కాలువ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు.
కన్నెపల్లి పంపుహౌస్ ఫోర్‌బే, హెడ్ రెగ్యులేటర్ పనులను పరిశీలించిన సమయంలో హెడ్ రెగ్యులేటర్ పనుల్లో ఉన్న సాంకేతిక లోపాలను సవరించాలని అధికారులకు సూచించారు. కన్నెపల్లి పంపుహౌస్ పనులను, ఇక్కడ పదకొండు పంపులు బిగించే ప్రక్రియను మార్చి 31వ తేదీలోగా పూర్తిచేయాలని అన్నారు. సముద్ర మార్గంలో చెన్నై దాకా చేరుకొని పోర్టులో ఉన్న మోటర్లను వెంటనే తెప్పించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. నిధులపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తిచేసే విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దని సీఎం అన్నారు.
సీఎం కేసీఆర్ వెంట ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, దివాకర్‌రావు, శ్రీధర్‌బాబు, టీఎస్ ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు, ప్రాజెక్టు సీఈ వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, లిఫ్ట్ సలహాదారు పెంటారెడ్డి, ఎల్‌అండ్‌టీ సీఎండీ సుబ్రమణ్యన్, మెగా ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.