పల్లా,వాణీదేవిలకు సీఎం కేసీఆర్‌ అభినందనలు..

152
cm kcr
- Advertisement -

రాష్ట్రంలో గత ఆదివారం రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో ఎస్‌ వాణీదేవి, నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజేతలుగా నిలిచారు.ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర మంత్రులు సీఎం కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

శనివారం సాయంత్రం మంత్రులు మల్లారెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, కే తారకరామారావు, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, మహమూద్‌ అలీ, కొప్పుల ఈశ్వర్‌, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు. ఎంపీలు సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, శేరి సుభాశ్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, నవీన్‌కుమార్‌, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, కేపీ వివేకానంద్‌, అబ్రహం, కృష్ణమోహన్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌, రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథం, పార్టీ నాయకులు ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు.

మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలుపొందిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేసిన తర్వాత ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చి, అన్నీతానై తన గెలుపునకు కారణమైన సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. విజయంసాధించిన వాణీదేవిని సీఎం కేసీఆర్‌ అభినందించారు. శాలువాతో సన్మానించారు. కష్టపడి సమిష్టిగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించిన మంత్రులను సీఎం అభినందించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నల్లగొండ- వరంగల్‌- ఖమ్మం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. శనివారం రాత్రి సీఎం కేసీఆర్‌.. పల్లాకు ఫోన్‌ చేసి మాట్లాడారు. పల్లాను గెలిపించిన పట్టభద్రులకు, ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయానికి కృషిచేసిన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలియజేశారు.

- Advertisement -