ఆర్టీసీ కార్మికులకు శుభవార్తను అందించింది తెలంగాణ ప్రభుత్వం. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను విడుదల చేసింది. రూ. 235 కోట్ల రూపాయల నిధుల విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీ విషయంలో చెప్పినట్లుగానే నిధులు కేటాయిస్తోంది ప్రభుత్వం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1000 కోట్లు కేటాయించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు వెయ్యి కోట్లను కేటాయించారు సీఎం. అంతేగాదు రిటైర్ మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికై బోర్డు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో వెల్లడించారు.
ఏ ఒక్క కార్మికుడిని కూడా తీసివేయమని సీఎం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు సమ్మె సందర్భంగా చనిపోయిన కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించారు. ఆర్టీసీ మహిళా కార్మికుల ప్రసూతి సెలవులు మంజూరు చేయడంతో పాటు..రాత్రి 8 గంటలకు విధులు ముగిసేలా చర్యలు తీసుకున్నారు.