దేశానికే రోల్‌మోడ‌ల్‌గా తెలంగాణ‌- సీఎం కేసీఆర్‌

74
kcr cm
- Advertisement -

హైదరాబాద్‌, మాదాపూర్‌లోని హైటెక్స్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ అమ‌ర‌వీరుల స్థూపానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేశారు. ప్లీన‌రీ స‌భా వేదిక వ‌ద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కంచుకోట అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌సంగించారు. టీఆర్ఎస్ పార్టీ 21 వ‌సంతాలు పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెడుతున్న సంద‌ర్భంగా పార్టీ శ్రేణుల‌కు సీఎం కేసీఆర్ హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు. నిబ‌ద్ధ‌మైన, సువ్య‌వ‌స్థీత‌మై కొలువుదీరిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ పేర్కొన్నారు. 80 శాతం మంది ప‌రిపాల‌న భాగ‌స్వాములుగా ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల‌తో, 60 ల‌క్ష‌ల మంది స‌భ్యుల‌తో, సుమారు వెయ్యి కోట్ల ఆస్తులు క‌లిగి ఉన్న సంస్థ‌గా అనుకున్న ల‌క్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధ‌న జ‌రిపి, సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్ష‌తంగా తీర్చిదిద్దుతున్న‌టువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ కాప‌లాదారు టీఆర్ఎస్ పార్టీ..
ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్ట‌ని కోట‌. ఎవ‌రూ కూడా బ‌ద్ద‌లు కొట్ట‌లేని కంచుకోట అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇది తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి. ఈ పార్టీ యావ‌త్తు తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి. ఇది ఒక వ్య‌క్తిదో, శ‌క్తిదో కాదు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి టీఆర్ఎస్ పార్టీ. అనుక్ష‌ణం తెలంగాణ రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల‌ను, ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించే కాప‌లాదారు టీఆర్ఎస్ పార్టీ సీఎం పేర్కొన్నారు.

దేశానికే రోల్‌మోడ‌ల్‌గా తెలంగాణ‌..
రెండు ద‌శాబ్దాల క్రితం ఏడుపు వ‌స్తే కూడా ఎవ‌ర్నీ ప‌ట్టుకొని ఎడ్వాలో తెలువ‌ని ప‌రిస్థితి అని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర అస్థిత్వ‌మే ఆగ‌మ‌యైపోయే ప‌రిస్థితి. ఒక దిక్కుతోచ‌ని సంద‌ర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల నుంచి ఈ గులాబీ జెండా ఎగిసిప‌డింది. అప‌జ‌యాలు, అవ‌మ‌నాలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించాం. రాష్ట్రాన్ని సాధించుకున్న త‌ర్వాత ప్ర‌జ‌ల దీవెనతో అద్భుత‌మైన పరిపాల‌న అందిస్తున్నాం. దేశానికే రోల్ మోడ‌ల్‌గా తెలంగాణ నిలిచింది అని కేసీఆర్ తెలిపారు.

అవార్డులు మ‌న ప‌నితీరుకు మ‌చ్చుతున‌క‌..
కేంద్ర ప్ర‌భుత్వం అనేక ప‌ద్ధ‌తుల్లో వెలువ‌రిస్తున్న ఫ‌లితాలు, అవార్డులు, రివార్డులే మ‌న ప‌నితీరుకు మ‌చ్చుతున‌క అని కేసీఆర్ పేర్కొన్నారు. నిన్న విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో దేశంలో అతి ఉత్త‌త‌మైన‌టువంటి ప‌ది గ్రామాలు తెలంగాణ‌వే నిలిచాయి. ఈ విష‌యాన్ని కేంద్ర‌మే స్వ‌యంగా ప్ర‌క‌టించింది. మ‌న ప‌నితీరుకు ఇది మ‌చ్చుతున‌క అని చెప్పారు. కేంద్రం నుంచి అవార్డు రాన‌టువంటి డిపార్ట్‌మెంట్ తెలంగాణ‌లో లేద‌న్నారు. ఒక నిబ‌ద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో, అవినీతిర‌హితంగా, చిత్త‌శుద్ధితో ప‌రిపాల‌న సాగిస్తున్నాం. క‌రువు కాట‌కాల‌కు నిల‌యంగా ఉన్న తెలంగాణ ఇవాళ జ‌ల‌భాండ‌గారంగా మారింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై అంత‌ర్జాతీయ చానెళ్లు క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నాయి. పాల‌మూరు రంగారెడ్డి, సీతారామ పూర్తి చేసుకుంటే తెలంగాణ‌లో క‌రువు ఉండ‌నే ఉండ‌దని స్ప‌ష్టం చేశారు.

అన్ని రంగాల్లో అద్భుత ఫ‌లితాలు..
విద్యుత్ రంగంలో దేశ‌మంతా కారు చీక‌ట్లు క‌మ్ముకున్న వేళ‌లో వెలుగు జిలుగుల తెలంగాణ‌ను ఏర్పాటు చేసుకున్నామ‌ని కేసీఆర్ తెలిపారు. ఇది మ‌న అంకిత భావానికి మంచి ఉదాహ‌ర‌ణ‌. ఏ రంగంలో అయినా అద్భుత‌మైన ఫ‌లితాలు సాధిస్తున్నాం. దేశానికే ఆద‌ర్శ‌ప్రాయంగా నిలుస్తున్నాం. ఎంద‌రో మ‌హానుభావులు, గొప్ప‌వాళ్లు, పార్టీకి అంకిత‌మై ప‌ని చేసే నాయ‌కుల స‌మాహార‌మే ఈ ఫ‌లితాల‌కు కార‌ణం అని పేర్కొన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌లే ఇతివృత్తంగా ప‌ని చేస్తున్నాం. గొప్ప‌లు చెప్పుకొని పొంగిపోవ‌డం లేదు.. వాస్త‌వాలు మాట్లాడుకుంటున్నామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. భార‌త‌దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో క‌రెంట్ కోత‌ల‌తో ప్ర‌జ‌లు, రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ నిర్వాకం వ‌ల్లే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కూడా క‌రెంట్ కోతలున్నాయి. చుట్టూ అంధ‌కార‌మే ఉన్న‌ప్ప‌టికీ.. మ‌ణిద్వీపంలా తెలంగాణ వెలుగుతున్న‌ది అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇటీవ‌లి కాలంలో దేశంలో విప‌రీత‌మైన జాఢ్యాలు, అనారోగ్య‌క‌ర‌మైన‌, అవ‌స‌రం లేవ‌నుట‌వుంటి పెడ ధోర‌ణులు ప్ర‌బలుతున్నాయ‌ని కేసీఆర్ తెలిపారు. భార‌త స‌మాజానికి ఇది శ్రేయ‌స్క‌రం కాదు. స‌మాజంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ ఆద‌రించాలి. అద్భుత‌మైన ఈ దేశంలో దుర్మార్గ‌మైన విధానాలు దేశ ఉనికినే ప్ర‌శ్నించే స్థాయికి పోతున్నాయి. ఈ సంద‌ర్భంంలో ఒక రాజ‌కీయ పార్టీగా మ‌నం ఏం చేయాలి. మ‌న ఆలోచ‌న ధోర‌ణి విధంగా ఉండాల‌న్నారు కేసీఆర్. ఈ దేశ అభ్యున్న‌తి కోసం శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఒక నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

దేశంలో స్థాపిత విద్యుత్ శ‌క్తి సామ‌ర్థ్యం 4,01,035 మెగావాట్లు..
ఇవాళ దేశంలో స్థాపిత విద్యుత్ శ‌క్తి సామ‌ర్థ్యం.. 4,01,035 మెగావాట్ల అందుబాటులో ఉంద‌ని సీఎం తెలిపారు. అందుబాటులో ఉన్న వినియోగించ‌లేని ప‌రిస్థితిలో ఈ దేశం ఉంది. 4 ల‌క్ష‌ల మెగావాట్ల విద్యుత్ శ‌క్తి ఉన్న‌ప్ప‌టికీ.. 2 ల‌క్ష‌ల‌కు మించి వాడ‌టం లేదు. ప్ర‌ధాని సొంత రాష్ట్ర‌మైన‌ గుజ‌రాత్‌లో కూడా క‌రెంట్ కోత‌లు ఉన్నాయి. పంట‌లు ఎండిపోతున్నాయి. మ‌న చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో కూడా క‌రెంట్ కోతలు ఉన్నాయి. చుట్టూ అంధ‌కారం ఉంటే ఒక మ‌ణిద్వీపంలా తెలంగాణ వెలుగుతున్న‌ది. ఏడేండ్ల క్రితం మ‌న‌కు కూడా క‌రెంట్ కోత‌లే. కానీ మ‌నం ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించాం. వెలుగు జిలుగుల తెలంగాణ‌గా తీర్చిదిద్దుకున్నాం. తెలంగాణ‌లా దేశం ప‌ని చేసి ఉంటే.. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు ముంబై నుంచి కోల్‌క‌తా వ‌ర‌కు 24 గంట‌లక‌రెంట్ ఉండేది. దేశంలో ఉన్న సీఎంల స‌మ‌క్షంలో, ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న వ‌హించే నీతి ఆయోగ్‌లోనూ ఈ విష‌యాన్ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టి చెప్పాను. కానీ లాభం లేద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ దేశంలో 65 వేల టీఎంసీల నీరు పుష్క‌లంగా ఉండ‌గా.. రాష్ట్రాల మ‌ధ్య నీటి యుద్ధాలు ఎందుకు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ వేదిక‌గా సీఎం కేసీఆర్ దేశంలోని నీటి వ‌న‌రుల‌పై ప్ర‌సంగించారు. ఈ దేశంలో స‌జీవంగా ప్ర‌వ‌హించే న‌దుల్లో ఉన్న నీటి ల‌భ్య‌త 65 వేల టీఎంసీలు అని కేసీఆర్ తెలిపారు. మ‌రో నాలుగైదు టీఎంసీల లెక్క తేలాల్సి ఉంది. ఇది అంత‌ర్జాతీయ గొడ‌వ‌ల్లో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ట్టిన ప్రాజెక్టుల ద్వారా 29 వేల టీఎంసీలు మాత్ర‌మే దేశం వాడుకుంటోంది. దేశంలో ఎక్క‌డా చూసిన నీటి యుద్ధాలే. దీనికి కార‌ణం ఎవ‌రు. 65 వేల టీఎంసీల నీరు ఉండి కావేరి జ‌లాల‌ కోసం త‌మిళ‌నాడు – క‌ర్ణాట‌క మ‌ధ్య‌ యుద్ధం, సింధూ – స‌ట్లెజ్ జ‌లాల కోసం రాజ‌స్థాన్ – హ‌ర్యానా మ‌ధ్య యుద్ధం ఏర్ప‌డింద‌న్నారు.

తాగునీళ్ల‌కు కూడా ఈ దేశం నోచుకోవ‌డం లేదు..
క‌నీసం తాగునీళ్ల‌కు కూడా ఈ దేశం నోచుకోవ‌డం లేదని కేసీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సాగునీటి స‌మ‌స్య‌లున్నాయి. క‌రెంట్ కోత‌లున్నాయి. మాట‌లు చెప్తే మైకులు హోరెత్తుతున్నాయి. వాగ్దానాల హోరు.. ప‌నిలో జీరో. మౌలిక వ‌స‌తులు లేవు అని కేంద్రాన్ని విమ‌ర్శించారు. తాగ‌డానికి నీల్లు లేని దుస్థితిలో ఈ దేశం ఉంది. ఇది ఎవ‌రి అస‌మ‌ర్థ‌త‌. ఈ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌బ‌డాలి. ఇందుకోసం జ‌రిగే ప్ర‌స్థానంలో, ప్ర‌య‌త్నంలో ఉజ్వ‌ల‌మైన పాత్ర మన రాష్ట్రం పోషించాలని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇది క‌ఠోర‌మైన వాస్త‌వం.. నిప్పులాంటి నిజం..
ఒక్క‌టే ఒక్క మాట‌లో చెప్పాలంటే ఈ దేశంలో అత్య‌ధిక యువ‌శ‌క్తి ఉంద‌ని కేసీఆర్ తెలిపారు. 13 కోట్ల మంది భార‌తీయులు విదేశాల్లో జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. భార‌త పౌరులు అమెరికాలో గ్రీన్ కార్డు దొరికితే.. ఇక్క‌డ వారి త‌ల్లిదండ్రులు పార్టీలు చేసుకుంటున్నారు. ఏమిటీ ఈ దౌర్భాగ్యం. అన్ని వ‌న‌రులు ఉండి ఈ దేశం ఎందుకు కూనారిల్లుతుంది. దీని మీద అంద‌రం ఆలోచించాలి. ప్ర‌జా జీవితంలో ప‌ని చేస్తున్నాం కాబ‌ట్టి.. ఈ దేశానికి ప‌ట్టిన దుస్థితిని త‌రిమేయాలి. మ‌ట్టి, నీళ్లు లేని సింగ‌పూర్ ఆర్థిక ప‌రిస్థితిలో నంబ‌ర్ వ‌న్‌లో ఉంద‌న్నారు. మంచినీల్లు కూడా మ‌లేషియా నుంచి కొంటారు. అన్నం ముద్ద కూడా వారిది కాదు. ఆ దేశంలో ఏమి లేదు.. కానీ ఆర్థిక స్థితిలో నంబ‌ర్ వ‌న్‌గా ఉంది. మ‌న ద‌గ్గ‌ర అన్ని ఉన్నాయి కానీ ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డ‌టం లేదు. ఇది క‌ఠోర‌మైన వాస్త‌వం.. నిప్పులాంటి నిజం అని కేసీఆర్ తేల్చిచెప్పారు.

దేశానికి కావాల్సింది ప్ర‌త్యామ్నాయ ఎజెండా.. రాజ‌కీయ ఫ్రంట్‌లు కాదు..
దేశానికి కావాల్సింది రావాల్సింది రాజ‌కీయ ఫ్రంట్‌లు కాదు.. ఇవేం సాధించ‌లేవు.. ఇవాళ దేశానికి కావాల్సింది ప్ర‌త్యామ్నాయ ఎజెండా. ఒక అద్భుత‌మై ప్ర‌గ‌తి ప‌థంలో తీసుకెళ్లే ఎజెండా కావాలి. ఆ సిద్ధాంతానికి ప్ర‌తిపాదిక ప‌డాలని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. 2000లో తాను తెలంగాణ అని మాట్లాడితే.. ఏం ప‌ని లేదా అని కొంద‌రు అన్నారు. సంక‌ల్పంతో జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రులకు, ఆ భ‌గ‌వంతుడికి దండం పెట్టి బ‌య‌లుదేరి తెలంగాణ సాధించాం. అంతేకాదు.. సాధించిన తెలంగాణ‌ను దేశానికి రోల్‌మోడ‌ల్‌గా నిలిచేలా చేశామ‌న్నారు. పాల‌మూరు జిల్లాలో వ‌ల‌స‌లు పోయేవారు. ఇవాళ వ‌ల‌స‌లు రివ‌ర్స్ వ‌చ్చాయి. 11 రాష్ట్రాల నుంచి మ‌న వ‌ద్ద‌కు వ‌ల‌స‌లు వ‌స్తున్నారు. బీహార్ హ‌మాలీ కార్మికులు లేక‌పోతే తెలంగాణ రైస్‌మిల్లులు న‌డ‌వ‌వు. హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్ లో భ‌వ‌న నిర్మాణ రంగంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బీహార్ కార్మికులు ప‌ని చేస్తున్నారు. తెలంగాణ‌లో ప‌ని పుష్క‌లంగా దొరుకుతోంది. శాంతి భ‌ద్ర‌త‌లు ప‌టిష్టంగా ఉన్నాయని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఈ దేశాన్ని గొప్ప‌గా తీర్చిదిద్దాలి..
చేయ‌గ‌లిగే సామ‌ర్థ్యం, సంక‌ల్పం, చిత్త‌శుద్ధి ఉంటే ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఆర్థిక‌శ‌క్తిగా ఎదిగే వ‌న‌రుల‌ను భార‌త్ క‌లిగి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ ఇవాళ దుఖ ప‌డుతున్నాం. నివార‌ణ జ‌ర‌గాలి. కేసీఆర్ రాజ‌కీయ ఫ్రంట్ ప్ర‌క‌టిస్తాడా? అని అంటున్నారు. దేశం బాగు కోసం ఒక ప్రాసెస్ జ‌ర‌గాలి. భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు అనుకూల‌మైన ఫ్రంట్ ఉంట‌ది. ఈ దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దే ప్ర‌త్యామ్నాయ ఎజెండాకు శ్రీకారం చుడుదాం. దేశం బాగుప‌డ‌టానికి మ‌న రాష్ట్రం నుంచి ప్రారంభం జ‌రిగితే అది మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం అని సీఎం అన్నారు.

ఈ దేశానికే గ‌ర్వ‌కార‌ణం..
తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన.. దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌డానికి, గ‌తిని, స్థితిని మార్చ‌డానికి, దేశాన్ని స‌రైన ప్ర‌గ‌తి పంథాలో న‌డిపించ‌డానికి హైద‌రాబాద్ వేదిక‌గా కొత్త ఎజెండా, ప్ర‌తిపాద‌న‌, సిద్ధాంతం త‌యారై దేశం న‌లుమూల‌ల వ్యాపిస్తే ఈ దేశానికే గ‌ర్వ‌కార‌ణంగా ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ గుంపు కాదు.. కూట‌మి కాదు.. ప్ర‌త్యామ్నాయ ఎజెండా ఈ దేశానికి కావాలి. ఆ దారులు వెత‌కాలి. నూత‌న వ్య‌వ‌సాయ విధానం, నూత‌న ఆర్థిక విధానం, నూత‌న పారిశ్రామిక విధానం రావాలి. అందుకు అవ‌స‌ర‌మైన వేదిక‌లు త‌యారు కావాలి. ఆ భార‌త‌దేశం ల‌క్ష్యంగా పురోగ‌మించాలి. సంకుచిత రాజ‌కీయాలు వ‌ద్దు. దేశానికి కావాల్సింది అభ్యుద‌య ప‌థం కావాలి. అప్పుడే దేశం అద్భుతంగా బాగుప‌డ‌త‌ది. ఉజ్వ‌ల‌మైన భార‌త్ త‌యారవుతోంది అని కేసీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -