అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. మరికాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈఎన్‌సీ(ఇంజినీర్ ఇన్ చీఫ్), నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెళ్లనున్నారు. తెలంగాణ, ఏపీల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.
ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ మొదటి అంతస్థులోని జలవనరుల మంత్రిత్వ శాఖ మీటింగ్ హాలులో ఈ సమావేశానికి వేదిక కానుంది. సమావేశానికి తెలంగాణ, ఏపీ నుంచి ఐదుగురు చొప్పున సభ్యులు హాజరుకానున్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రలను ఎండ గట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోతిరెడ్డిపాడునుంచి అడ్డగోలు నీటి మళ్లింపు అంశాన్ని లేవనెత్తి ఏపీని కడిగిపారేయాలని నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వ నీటి దోపిడీని గణాంకాలతో సహా ఆ రాష్ట్ర ప్రతినిధుల సమక్షంలోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళనున్నారు. ఐదు ప్రధాన అంశాలతో ఎజెండాను రూపొందించారు.
ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరుకానున్నారు.పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్రానికి గతంలో ఫిర్యాదు చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కొత్తగా చేపట్టిన ఈ ప్రాజెక్టు అక్రమమని ఏపీ ఫిర్యాదు చేయగా ఇది ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టేనని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఈ అంశంపైనే అపెక్స్ కౌన్సిల్‌లో వాడి వేడి చర్చలు జరిగే అవకాశం ఉంది.