కేంద్రంపై సీఎం కేసీఆర్ మరోసారి ఫైర్..

50
kcr cm
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి ప్రారంభంకానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణ మరియు జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “విధ్వంసం అనంతరం వ్యవస్థలను పునర్న్మించుకోవడం చాలా కష్టమైన పని. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ధ్వంసమైన తెలంగాణను తిరిగి బాగు చేసుకోవడానికి మనం చాలా కష్టపడాల్సి వస్తున్నది. అన్ని కష్టాలను అధిగమించి మనం నేడు దేశం గర్వించే స్థాయిలో ధ్వంసమైన తెలంగాణ పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. ఫలితాలు ఊరికే రావు. ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కార్యాచరణలో అధికారులు శ్రద్ధాసక్తులతో, చిత్తశుద్ధితో పాల్గొన్నప్పుడే ఫలితాలు సాధ్యమైతాయి. తెలంగాణ నూతన పంచాయతీ రాజ్ చట్టం తెచ్చినప్పుడు పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ నేడు వారి అనుమానాలను పటాపంచలు చేసి తెలంగాణ పల్లెలను అభివృద్ధి పథాన నడిపించుకుంటున్నాం. ప్రతి గ్రామానికి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకొని ప్రగతి సాధిస్తున్నాం. ప్రతీ పల్లెలో ఇవాళ ఒక ట్రాక్టర్ ను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకున్నాం. ప్రభుత్వం చేపట్టిన చర్యలు నేడు గ్రామాల్లో స్ఫూర్తిని నింపాయి.

నేను గతంలో చెప్పినట్టు… ఎస్ కె డే ప్రారంభించిన పంచాయతీ రాజ్ వ్యవస్థ ఒక ఉద్యమం. కానీ నేడు అందులో రాజకీయాలు ప్రవేశించి అవి అన్ని రకాలుగా పంచాయతీ రాజ్ స్ఫూర్తి చంపివేయబడ్డది. దేశంలో ప్రారంభమైన సహకార ఉద్యమం కూడా కలుషితం చేయబడ్డది. ఇటువంటి అరాచకమైన, నిర్లక్ష్యమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభ దశలో తీసుకున్న నిర్ణయాలు, ఎంచుకున్న ప్రాధాన్యతా క్రమాలు కొందరికి జోక్ లాగా కనిపించాయి. తెలంగాణ వచ్చిన ప్రారంభంలో నేను అటవీ శాఖ, అడవుల పరిరక్షణ మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తే ఈ అడవులేంది అని కొందరు నవ్వుకున్నారు. కానీ నేడు దేశ పర్యావరణం, పచ్చదనంలో భాగస్వామ్యం పంచుకోవడంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ వచ్చేనాటికి అస్తవ్యస్తంగా, యుద్ధ వాతావరణంతో కూడుకొని ఉన్న గ్రామీణ మంచినీటి వ్యవస్థను ఇవ్వాల దేశం గర్వించేలా మిషన్ భగీరథ ద్వారా తీర్చిదిద్దుకున్నాం. ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్న పరిస్థితి దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేదు. అన్ని రంగాల్లో జరిగిన తెలంగాణ అభివృద్ధిని ఇటీవల కొన్ని జాతీయ మీడియా ఛానళ్ళు ప్రసారం చేశాయి. ఇది చూసిన ఇతర రాష్ట్రాల వారికి ఆశ్చర్యం కలిగింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి నాకు ఫోన్లు చేసి అడుగుతన్నారు. అంటే మనం అనతికాలంలో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించాం. ఇందులో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు సీఎం.

ఇదే సందర్భంలో ఒక విషయాన్ని మీ దృష్టికి తేదలిచాను. పంచాయతీ రాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి వరకు ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉన్నది. జవహర్ రోజ్ గార్ యోజన, ప్రధాని గ్రామ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదు. రాష్ట్రాలలో నెలకొన్న స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి. రోజువారి కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం సరైన విధానం కాదు. 75 సంవత్సరాల అమృత మహోత్సవాల నేపథ్యంలో దేశంలో ఇంకా కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయి. త్రాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు ఎక్కుతున్నారు. విద్య, వైద్యం అనేక రంగాలల్లో రావాల్సినంత ప్రగతి రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా, రాష్ట్రాల విధులలో జోక్యం చేసుకోవానుకోవడం సమర్థనీయం కాదు” అని సీఎం వివరించారు.

- Advertisement -