కరుణానిధి మృతిపై కేసీఆర్, చంద్రబాబు, రజనీ సంతాపం..

211
CM KCR
- Advertisement -

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తీవ్ర జ్వరం, మూత్ర పిండాల సమస్య కారణంగా పది రోజుల క్రితం చెన్నైలోని కావేరి దవాఖానలో చేరగా ఆయన మంగళవారం (ఈ రోజు) తుది శ్వాస విడిచారు. కరుణానిధి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. వీరి తో పాటు కరుణానిధి మృతికి ఏపీ మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా తమ సంతాపం తెలిపారు.

కరుణానిధి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత రాజకీయ రంగానికి కరుణానిధి మృతి తీరని లోటన్నారు. కరుణానిధి తమిళ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా, భారత రాజకీయాల్లో అత్యంత క్రియాశీల నాయకుడిగా దశాబ్దాల తరబడి సేవలందించారన్నారు. సామాన్య ప్రజలకు రాజకీయ చైతన్యం కలిగించిన నాయకుడు కరుణానిధి అని సీఎం అన్నారు.

CM KCR

కరుణానిధి మరణ వార్త యావత్తు దేశానికే తీరని లోటని గవర్నర్‌ నరసింహన్ అన్నారు. భారత దేశం రాజకీయ యోధుడిని కోల్పోయిందని చంద్రబాబు తన విషాదాన్ని వ్యక్తం చేశారు. సాహిత్యం, సినీ, పత్రికా, రాజకీయ రంగాల్లో కరుణానిధి విశేష కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు. సేవాభావం, పాలనా అనుభవంతో ప్రజల గుండెల్లో కరుణానిధి నిలిచిపోయారని, నిరుపేదలు బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన పరితపించారని అన్నారు.

కరుణానిధి మృతిపై తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైయ్యారు. రజనీకాంత్‌, రాధిక, హన్సిక తదితరులు ట్విటర్‌ వేదికగా ఆవేదనతో వారి సంతాపం వ్యక్తం చేశారు. ‘ఇది బ్లాక్‌ డే. ఈ రోజును నేను ఎప్పుడూ మర్చిపోలేనని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని’ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆగస్టు 7.. బ్లాక్‌డేగా (చీకటి రోజు) అభివర్ణించారు.

- Advertisement -