సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కేంద్రమంత్రులు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో సమావేశమైన సీఎం… రహదారుల విస్తరణలో భాగంగా కంటోన్మెంట్ భూములను కేటాయించాలని కోరారు. దాదాపు 10 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. రాజ్ నాథ్‌తో సమావేశం అనంతరం హైదరాబాద్‌కు పయనమయ్యారు సీఎం.
అంతకముందు ప్రధాని నివాసంలో నరేంద్రమోడీతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్.ఈ సమావేశంలో గోదావరి, కృష్ణా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం సహాయం అందించాల్సిందిగా కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేదా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరారు.
వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం అందించే అంశంతో పాటు పన్నుల వాటా పెంచాలని ప్రధానిని కోరారు. విభజన హామీలను అమలుచేయాలని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరారు.
అంతకముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సుమారు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు,కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయాలపై ఈ భేటీలో చర్చించారు.