టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శుక్రవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో బొజ్జల మృతికి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. సహచరుడు, ఆత్మీయుడిని కోల్పోయానంటూ కేసీఆర్ పేర్కొన్నారు. బొజ్జల కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ కూడా టీడీపీలో కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో కేసీఆర్ అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. అలాంటి నేతల్లో బొజ్జల కూడా ఒకరు. ఈ కారణంగానే బొజ్జల మృతి వార్త తెలిసినంతనే తన ఆత్మీయుడిని కోల్పోయానంటూ కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
ఇవాళ అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి వెళ్లడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని హుటాహుటిన అపోలో చేర్పించారు. ఆస్పత్రిలో డాక్టర్లు సీపీఆర్ ద్వారా చికిత్స అందించినప్పటికి ఆయన తుదిశ్వాస విడిచారు.