నానక్‌రామ్ గూడలోని విజయ్‌కృష్ణ నివాసానికి వెళ్లి కృష్ణ భౌతిక కాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం మహేష్ బాబును ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… మన తెలుగు చలన చిత్రరంగంలో సుప్రసిద్ధ నటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు.
వ్యక్తిగతంగా నేను గొప్ప మిత్రుడిని కోల్పోయాను అని అన్నారు. ఈ ఇంటికి వారి ఆతిథ్యం మేరకు చాలా సార్లు వచ్చానని గుర్తుచేసుకున్నారు. ఆయన చాలా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అలాగే విలక్షణమైన నటుడు అని కొనియాడారు. పార్లమెంట్ సభ్యుడుగా దేశానికి సేవ కూడా చేశారని అన్నారు.
అల్లూరి సీతారామరాజు సినిమా చాలా బావుందన్నప్పుడు ఆయన నవ్వారని చెప్పారు. కేసీఆర్ గారు మీరు కూడా సినిమాలు చూస్తారా? అని కృష్ణ అన్నారని తెలిపారు. అల్లూరి సీతారామ రాజు సినిమా చాలా సార్లు చూశాను అని చెప్పినట్లు సీఎం కేసీఆర్ అన్నారు. అటువంటి మంచి దేశ భక్తిని ఉద్భోదించేటువంటి గొప్ప సందేశాత్మక చిత్రం నిర్మించారు.
తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో వారి అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారిచేసింది. ఏదేమైనప్పటికి ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను. ఈ సందర్భంగా కృష్ణ కుటుంబానికి దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు.
ఇవి కూడా చదవండి..