కాంగ్రెస్ తెలంగాణ పిశాచి అని..నడిబజార్ లో కాంగ్రెస్ దుర్నీతిని ఎండగడుతామని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇవాళ ప్రగతి భవన్ జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ది దివాళకోరు రాజకీయమని పేర్కొన్నారు. ఈ నెల 10 న ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి శంకుస్థాపన చేసిన తర్వాత రాష్ట్రమంతా తిరుగుతానని సీఎం అన్నారు. అప్పుడు కాంగ్రెస్ క్షుద్ర రాజకీయాలను ప్రజలముందే పెడతానని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై సలహాలివ్వమంటే కాంగ్రేసోళ్లు పారిపోయారని సీఎం అన్నారు.
ఆనాడు ఫజర్ అలీ కమిషన్ వద్దన్నా బలవంతంగా కాంగ్రెస్ నేతలు ఏపీలో కలిపారని.. 1969 లో 400 మంది చావులకు కారణమయ్యారని దుయ్యబట్టారు. తెలంగాణ లో ఇక బతకమన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ రాష్ట్రాన్నిచ్చిందని… అంతే కాని తెలంగాణ ప్రజలపై ప్రేమతో కాదన్నారు. మూడేళ్ల నుంచి తాము నిబద్దతతో పని చేస్తుంటే.. వాళ్లు మాత్రం సొల్లు పురాణం చెబుతున్నారని ఆయన చెప్పారు.
పోలీసు శాఖ వాహనాలు కొనుగోలుకు సంబంధించి అక్రమాలు చోటుచేసుకున్నాయని, మంత్రి కేటీఆర్ కు చెందిన సంస్థకు ఆ టెండర్ ను కట్టబెట్టారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఏం తెలియకుండా జైరాం రమేష్ మాట్లాడుతున్నారని, చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపని పక్షంలో ఆయన ముక్కునేలకు రాయాలని అన్నారు. ‘జైరామ్ రమేశ్ కనీసం సర్పంచ్ గానైనా ఎప్పుడైనా పోటీ చేసి గెలిచారా?’, ‘రాజ్యసభ బగ్’ అంటూ ఆయనపై కేసీఆర్ మండిపడ్డారు.
డ్రగ్స్ వాడకం లిస్ట్ లో తెలంగాణ లేదని సీఎం స్పష్టం చేశారు. మొగ్గ దశలోనే డ్రగ్స్ ను తుంచి వేయాలని ఆదేశించామని, డ్రగ్స్ వాడకంలో కేబినేట్ మంత్రులున్నా వదలొద్దని చెప్పానని ఆయన అన్నారు. డ్రగ్స్, పబ్బులు, పేకాట తెచ్చింది కాంగ్రేస్ అయితే… పేకాట లేకుండా తాము చేశామని.. దీన్ని కోర్టు కూడా సమర్థించిందన్నారు.