సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెల 17వ తేదీన కేసీఆర్ 65వ ఏటా అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ బర్త్ డే సందర్భంగా పలు సామాజిక కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు ,అన్నదానాలు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, రోగులకు పండ్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేయనున్నారు.
ఇక గతంలో ఎన్నడూలేనివిధంగా ఈ సారి అవయవ దాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నారు. తెలంగాణ జాగృతి,టీ న్యూస్ ఆధ్వర్యంలో ఉదయం 9గంటలకు అవయవదాన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఎంపీ కవిత. అవయవ దానం చేయండి..జీవితాన్ని సార్థకం చేసుకోండి ..మరణించినా జీవించండి అనే స్లోగన్‌తో ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపనున్నారు.
జలవిహార్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. కేసీఆర్ నిర్వహించిన హోమాలు, యజ్ఞాల వివరాలతో పాటు కేసీఆర్ చిన్ననాటి విశేషాలతో కూడిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకలకు కేటీఆర్, హరీష్ రావు, కవిత తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.