త్వరలో రాష్ట్ర గీతాన్ని తీసుకొస్తామని…నీటి సామర్ధ్యం పెంచేందుకే ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేపట్టామన్నారు సీఎం కేసీఆర్. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం…సభ్యులు లేవనెత్తిన సందేహాలకు సమాధానం చెప్పారు.
తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు గణనీయంగా పెంచామని…. 2014 కంటే ముందు 29 లక్షల రేషన్ కార్డులుండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 39 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. ఆనాడు రూ. 200 పెన్షన్ ఇస్తే ఈనాడు రూ. 2016 పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు.
రాష్ర్టంలోని రైతులకు రుణమాఫీ వందకు 100 శాతం చేసి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గంధమల్ల, మల్లన్న సాగర్ నిర్వాసితులకు మంచి పరిహారం ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్, వరంగల్‌లో ఇచ్చే రేటును పల్లెల్లో ఇవ్వరు. చట్టాలను అనుసరించి, నిబంధనలు పాటిస్తూ.. భూములకు నష్ట పరిహారం ఇస్తున్నాం. ఎవరికీ నష్టం జరగనివ్వం అని స్పష్టం చేశారు. దేశంలో ఎవరికీ ఇవ్వని విధంగా పరిహారం ఇస్తూ, డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రుణమాఫీ చేయలేదు. పోడు భూముల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. 60 ఏండ్ల పాపాన్ని సమగ్రంగా పరిశీలించి పరిష్కరించుకుంటాం. పోడు భూముల విషయంలో పీఠముడి ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో నీటి తిరువా ముక్కుపిండి వసూలు చేశారు. తెలంగాణ రాష్ర్టంలో నీటి తిరువాను ఎత్తేశామన్నారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నాడు 128 ఎకరాల్లో పాలీ హౌజ్‌లు ఉంటే.. ఇప్పుడు 1300 ఎకరాల్లో ఉన్నాయని చెప్పారు సీఎం కేసీఆర్. రాష్ర్టంలో కరోనా వ్యాప్తిపై కన్నేసి ఉంచామని…గత వారం రోజుల నుంచి రాష్ర్టంలో కరోనా పెరుగుదల కనిపిస్తుంది. …. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్నారు.