ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం సీఎం కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఆయన పౌరవిమానయాన శాఖ, హౌసింగ్ మరియు పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఆరు డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌పురిని సీఎం కేసీఆర్ కోరారు.
రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల అంశంపై చర్చించి ఓ లేఖను అందజేశారు. పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్, వరంగల్ అర్బన్ జిల్లాలోని మామునూర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సంబంధించి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌తో సంప్రదింపులు జరిపినట్లు సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.