సీఎం దళిత్ ఎంపవర్ మెంట్‌కు 1000 కోట్లు- సీఎం కేసీఆర్‌

104
kcr cm
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. సీఎం దళిత సాధికారత విధివిధానాలపై ఈ సమావేశంలో చర్చించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం దశలవారీగా కార్యాచరణ చేపడుతున్నట్టు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను గుర్తించి పరిష్కారాలను వెతకాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ వారి జీవనోపాధి సాగింది. మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలి. గోరేటి వెంకన్న.. గల్లీ చిన్నది.. పాటను మనసు పెట్టీ వింటే దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయన్నారు సీఎం కేసీఆర్.

రైతు బంధు పథకం, ఆసరా పెన్షన్ల మాదిరి నేరుగా ఆర్ధిక సాయం అందే విధంగా…అత్యంత పారదర్శకంగా, మధ్య దళారీలు లేని విధానం కోసం సూచనలు సలహాలు ఇవ్వాలని అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులను కోరారు సీఎం కేసీఆర్‌. అట్టడుగున వున్న వారినుంచి సహాయం ప్రారంభించి, వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించాలి. అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

ఈ బడ్జెట్‌లో సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకానికి 1000 కోట్లు కేటాయించాలనుకున్నాం.. మరో 500 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. రాబోయే మూడు నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదని సీఎం స్పష్టం చేశారు. దళిత సాధికారతను సాధించడానికి ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేయడానికి నిశ్చయించుకున్నది. మీరందరూ కలిసిరావాలి. నాకు భగవంతుడిచ్చి సర్వ శక్తులన్నీ ఉపయోగించి, సీఎం దళిత సాధికారత పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనేదే నా దృఢ సంకల్పం అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -