ప్రభుత్వమే పూర్తిస్ధాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు సీఎం కేసీఆర్. ఇవాళ ప్రగతి భవన్ లో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం…రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని గ్రామాల్లో 6,408 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.
ధాన్యం కొనుగోలుకు అవసరమైన 20,000 కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చే ఏర్పాట్లను మంగళవారం సాయంత్రానికల్లా పూర్తి చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల తక్షణ ఏర్పాటు కోసం అన్ని జిల్లాల కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. మొత్తం 6,408 కొనుగోలు కేంద్రాల్లో 2,131 ఐకేపీ కేంద్రాలు, 3,964 పీ.ఏ.సీ.ఎస్. కేంద్రాలు, మిగతావి మరో 313 కేంద్రాలున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని, పత్తి మంచి క్వాలిటీ ఉండటంతోపాటు ఎక్కువ దిగుబడి వచ్చి అధిక ధర లభించే అవకాశం ఉన్నందున, వచ్చే వానాకాలం 75 నుండి 80 లక్షల ఎకరాల్లో పత్తి పండించడానికి సిద్ధం కావాలని సీఎం రైతులను కోరారు. ఇందుకు అవసరమైన విత్తనాల కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాలని సీఎం వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్ధన్ రెడ్డిని ఆదేశించారు.
అలాగే, 20 నుండి 25 లక్షల ఎకరాల్లో కందిపంట సాగు కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. పత్తి, కంది పంటలకు నీళ్ల తడులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుందని సీఎం తెలిపారు. ఈ యాసంగిలో 52.76 లక్షల ఎకరాల్లో వరి పంట పండిందని, దాదాపు 1 కోటి 17 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 21 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని సీఎం వివరించారు.