తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు శుభవార్త తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలిలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఓటాన్ అకంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇటీవల కేటాయించిన ఎమ్మెల్సీ సీట్లలో కూడా కూడా ఓ మహిళకు స్థానం కల్పించినట్లు తెలిపారు. మంత్రివర్గం విస్తరణ పరిధి మనకున్నది 17. రాబోయే రోజుల్లో ఇంకా ఆరుగురిని తీసుకోనేది ఉంది. దాంట్లో ఇద్దరి మహిళలకు చోటు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. తమకు మహిళలపై అమితమైన గౌరవం ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలే తమకు ఓట్లు వేశారనీ, అందువల్లే తాము ఇక్కడ కూర్చున్నామని సీఎం వ్యాఖ్యానించారు.
దీంతో పలువురు సభ్యులు ఒక్కసారిగా క్లాప్స్ కొడుతూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. మహిళా సంఘాలకు అందించే వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు నిర్ణీత గడువులోగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.