అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులకు సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. పర్యావరణం,అడవులు, పచ్చదనం లేని సమాజాన్ని ఊహించలేమన్నారు.అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం సంకల్పించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు లభించటంతో అద్భుతమైన ఫలితాలను చూస్తున్నామని తెలిపారు.
పర్యావరణ పరంగా తగిన రక్షణ చర్యలు చేపట్టని ఫలితమే గ్లోబల్ వార్మింగ్ రూపంలో చూస్తున్నామని వెల్లడించారు. అందుకే మనతోపాటు, భవిష్యత్ తరాలు కూడా ఈ పుడమిపై జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. పచ్చదనం 33 శాతం సాధించేదాకా కలిసికట్టుగా పనిచేద్దామన్నారు.
అటవీ రక్షణ కోసం కార్యదీక్షతో పనిచేసిన అధికారులు, సిబ్బంది 22 మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తి దాయకమన్నారు. హైదరాబాద్ లాంటి కాంక్రీట్ కీకారణ్యంలో కూడా ఊహించనంత పచ్చదనం పెరగడంతో అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తిదారుల సంఘం అందించే వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్- 2022 హైదరాబాద్‌కు దక్కిందన్నారు.
Also Read:Lemon:నిమ్మరసంతో ఆరోగ్యం ….