తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపచేసేలా సచివాలయ నిర్మాణం: కేసీఆర్

197
cm kcr
- Advertisement -

కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ భవన సముదాయం అటు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేసే విధంగా రూపొందాలని, అదే సందర్భంలో రాష్ట్ర పరిపాలనా కేంద్రానికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిలషించారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన సముదాయం రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలి. అదే సందర్భంగా పూర్తి సౌకర్య వంతంగా ఉండాలి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రధాన కార్యదర్శితో పాటు కార్యదర్శులు అంతా అందులోనే తమ విధులు నిర్వర్తించేలా ఉండాలి. గతంలో మాదిరిగా అక్కడొకరు ఇక్కడొకరు విసిరేసినట్లు ఉండొద్దు. మంత్రులు, కార్యదర్శులు ఒకే చోట ఉండాలి. సెక్రటేరియట్ సమీపంలోనే అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల కార్యాలయాల సముదాయాన్ని కూడా నిర్మిస్తాం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా ఒకే దగ్గర ఉంటుంది’’ అని సిఎం కేసీఆర్ వెల్లడించారు.

సెక్రటేరియట్ బాహ్య రూపం ఎంత హుందాగా, గొప్పగా ఉంటుందో లోపల కూడా అంత సౌకర్యవంతంగా, అన్ని వసతులతో ఉండాలి. దీనికి సంబంధించి మంత్రులు, కార్యదర్శుల చాంబర్లు, సమావేశ మందిరాలు, సిబ్బంది కార్యాలయాలు, లంచ్ హాల్స్, సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్, రికార్డు రూములు తదితరాలు ఎలా ఉండాలో నిర్ణయించాలి’’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ స్థలంలోనే ప్రార్థనా మందిరాలు, బ్యాంకు, క్రష్, విజిటర్స్ రూమ్, పార్కింగ్, భద్రతా సిబ్బంది నిలయం తదితర ఏర్పాట్లు ఎక్కడ ఎలా ఉండాలో నిర్ణయించాలని చెప్పారు. సౌకర్యాలు, సదుపాయాలు ఎలా ఉండాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకుని టెండర్లు పిలవాలని ఆదేశించారు.

- Advertisement -