మరో కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం..

225
cm jagan
- Advertisement -

మెట్టభూములకు సాగు నీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్‌ జలకళ (ఉచిత బోర్లు) పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు.

‘వైఎస్‌ఆర్‌ జలకళ’ కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లు ఖర్చుచేయబోతుంది. 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా సాగునీరు అందించనుంది. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్‌ వారికి అండగా నిలుస్తానని అప్పట్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. నవరత్నాల్లో భాగమైన ఆ హామీని నేడు నెరవేర్చారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతుల అభివృద్ది కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని జగన్ పేర్కొన్నారు. రైతు కోసం మరో అడుగు ముందుకు వేశామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తిస్తారని తెలిపారు.

- Advertisement -