తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ రోజు పౌరసరఫరాల భవన్‌లో నిత్యావసర సరుకుల హెూల్ సేల్ వ్యాపారులతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ పి. సత్యనారాయణరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ కు ముందు ఉన్న ధరల ప్రకారమే ఇప్పుడు నిత్యావసర సరుకులను విక్రయించాలని హెూల్ సేల్ వ్యాపారులకు కమిషనర్ విజ్ఞప్తి చేశారు. పప్పు ధాన్యాలు, చక్కెర, వంట నూనెలు, ఎండు మిర్చి, పసుపు, చింతపండు, ఉప్పు తదితర వస్తువుల నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, ఎప్పటివరకు సరిపోతాయి, ఎక్కడి నుండి దిగుమతి అవుతున్నాయి వంటి అంశాలని వారిని అడిగి తెలుసుకున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక నుండి చక్కెర, గుజరాత్ నుండి ఉప్పు, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ నుండి శెనగ పప్పు, మహారాష్ట్ర, కర్ణాటక నుండి కందిపప్పు, రాజస్థాన్ నుండి పెసరపప్పు, కృష్ణపట్నం, కాకినాడ, చెన్నై ఓడరేవుల నుండి ముడి వంట నూనెలను నిరంతరం దిగుమతి చేసుకుంటున్నామని వ్యాపారులు తెలిపారు. సరుకుల రవాణాలో సమస్యలు ఎదురవుతున్నాయని, వీటిని పరిష్కరించాలని కమిషనర్‌కి విజ్ఞప్తి చేశారు.
ఎక్కడైనా చెక్ పోస్టుల దగ్గర సరుకుల రవాణా వాహనాలను నిలిపివేస్తే డ్రైవర్ పేరు, వాహనం నెంబర్ తెలియజేస్తే వెంటనే సమస్యను పరిష్కరిస్తామని, రవాణాలో ఎలాంటి అవరోధాలు ఎదురు కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. రవాణా సమస్యలు ఎదురైతే హైదరాబాద్‌లోని సీఆర్ద్ర కార్యాలయంలో 040 23447770 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
మిర్యాలగూడ నుండి 800 టన్నుల బియ్యం వస్తాయని, హమాలీల కొరతతో రవాణాను సూర్యపేట నుంచి నిలిపివేశారని వ్యాపారులు ఈ సందర్భంగా కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సంబంధిత అధికారులతో కమిషనర్ మాట్లాడి సమస్య పరిష్కారానికి తగిన ఆదేశాలు జారీచేశారు.
కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మవద్దని, కోవిడ్-19 ప్రబలుతున్న నేపథ్యంలో ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వ్యాపార ధోరణితో కాకుండా మానవతా దృక్పథంతో, సామాజిక బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అధిక ధలపై విజిలెన్స్ బృందాలు ప్రత్యేకంగా నిఘా వేశాయని, అధిక ధరలకు విక్రయించినట్లు తేలితే పీడీ యాక్టు నమోదు చేస్తామని అన్నారు.