వాళ్ళకు నా వంతు సాయం చేస్తాఃచిరంజీవి

380
Chiraneevi Speech
- Advertisement -

సంగీతమంటే నాకు ప్రాణం. సంగీతం లేనిదే నేను లేను. అప్పటి చక్రవర్తి, ఇళయరాజా నుంచి రాజ్ కోటి, ఇప్పటి మణిశర్మ దాకా ఎంతోమంది సంగీత దర్శకుల బాణీలు, పాటలు, సంగీతం పాటలు ద్వారా నేను ప్రజలకు మరింత దగ్గరయ్యాను. వారందరితో అనుబంధాన్ని మర్చిపోలేను అని హీరో చిరంజీవి అన్నారు. సినీ మ్యుజీషియన్స్ యూనియన్ పక్షాన హైదరాబాద్‌లో శనివారం జరిగిన స్వరసంగమం సంగీత విభావరికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినీ సంగీత వాద్య కళాకారుల ఆర్థిక, ఆరోగ్య సంక్షేమం కోసం నిధుల సేకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని ఆయన అభినందించారు. ఒకప్పుడు మద్రాసులో ఏ.వి.ఎం, ప్రసాద్ స్టూడియో లాంటి స్టూడియోలలో పెద్ద రికార్డింగు హాళ్ళలో లైవ్ ఆర్కెస్ట్రాతో పాటలు రికార్డింగ్ చేస్తుంటే పండుగలా ఉండేది. ఇప్పుడు ఆధునిక సాంకేతికత వల్ల చిన్న గదుల్లోనే, డిజిటల్‌ గా ఆ ఎఫెక్టులను సృష్టిస్తున్నాం. ఆధునిక పరిజ్ఞానానికి సంతోషించాలో, బాధపడాలో అర్థం కావడం లేదు. అయితే, దీనివల్ల ఎంతోమంది సంగీత వాద్య కళాకారుల జీవనోపాధి పోవడం, నిపుణులైన కళాకారులు వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోతుండడం బాధగా ఉంది. వాళ్ళను ఆదరించి, కష్టాల్లో ఉన్న వాద్య కళాకారులను పరిశ్రమ తరఫున ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకు నా వంతుగా నేను సైతం అంటూ సాయమందిస్తా” అని చిరంజీవి సభాముఖంగా ప్రకటించారు.

తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్, శాసనసభ్యుడు రసమయి బాలకిషన్, నిర్మాత కె. వెంకటేశ్వరరావు, నటి రేణూ దేశాయ్, దర్శకుడు రాహుల్ రవీంద్ర, సినీ మ్యుజీషియన్స్ యూనియన్ కార్యవర్గ ప్రముఖులు గాయని విజయలక్ష్మి (అధ్యక్షురాలు ), కౌసల్య, అర్పీ పట్నాయక్, లీనస్ తదితరులు పాల్గొన్న ఈ సభలో సీనియర్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. వాద్య కళాకారుల గొప్పతనాన్ని గుర్తుచేశారు. వాళ్ళ సంక్షేమం కోసం అందరూ కలసి, ఏదైనా చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. “మేము ఎంత పాడినా, ఏం చేసినా, మా పాటలోని ఫీల్‌ను గ్రహించి, అద్భుతంగా తెరపైన అభినయించినప్పుడే వాటికి సార్థకత. అలా నా పాటలకు అత్యద్భుతంగా అభినయించి, తెరపై ప్రాణం పోసిన ఏకైక నటుడు చిరంజీవి. చిరంజీవిని కేవలం ఓ నటుడు అని నేను అనను. అతను మంచి పెర్ఫార్మర్. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్టిస్ట్. కేవలం అభిమానుల ఆనందం కోసం తనలోని అభినయ నైపుణ్య కోణాన్ని కూడా పక్కనపెట్టి, కొన్ని పాత్రలు చేయాల్సి వచ్చింది. చేశారు. ఇప్పుడు రానున్న సైరా లాంటి చిత్రాలు అతనిలోని అభినయ కోణాన్ని మరోసారి చూపెడతాయి” అని ఎస్పీబీ అభిప్రాయపడ్డారు.

- Advertisement -