రంగారెడ్డి జిల్లా చౌదర్ పల్లి క్రాప్ కాలనీ రైతులు తెలంగాణకు ఆదర్శం కావాలన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ సచివాలయంలో నిరంజన్ రెడ్డిని కలిశారు రైతులు. ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి చౌదర్ పల్లి క్రాప్ కాలనీ రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు.
ఎన్టీఆర్ నగర్ మార్కెట్లో ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తాం… రైతుల కష్టానికి తగిన ఫలితం రావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. అందుకే రాష్ట్రంలో క్రాప్ కాలనీలకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. సాంప్రదాయ పంటలసాగుతో రైతులు నష్టపోతున్నారు..గత ప్రభుత్వాలలో రైతుకు ప్రభుత్వాల అండ కరువయిందన్నారు.
ఆత్మవిశ్వాసం కోల్పోయిన రైతాంగానికి కేసీఆర్ వినూత్న పథకాలతో ఆత్మస్తైర్మం ఇస్తున్నామని వెల్లడించారు. రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు పథకాలు, సబ్సిడీ విత్తనాలు, సాగునీటి ప్రాజెక్టులకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి రైతాంగానికి బాసటగా నిలుస్తుందన్నారు. కోటి ఎకరాలకు సాగునీరందించే కల త్వరలోనే నెరవేరుతుందన్నారు.
క్రాప్ కాలనీలో కూరగాయలు సాగుచేస్తున్న 50 మంది రైతులు..తాము పండిస్తున్న కూరగాయలు మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా రైతులను సన్మానించారు నిరంజన్ రెడ్డి. ఎన్టీఆర్ నగర్ మార్కెట్ లో ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.