వెండితెర.. మహారాజు !

328
Chiranjeevi to host MEK season 4
- Advertisement -

దాదాపు 40 ఏండ్ల కిందట తెలుగు సినీప్రపంచంలో కి ఓ ప్రభంజనం వచ్చింది. జనం నీరాజనాలు పట్టారు. అంతవరకు ఉన్న తెలుగు సినిమాల ఒరవడిని మార్చి, టాలీవుడ్ కు కొత్త ఒరవడిని సృష్టించిన ఆ ప్రభంజనం పేరే చిరంజీవి. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్‌గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. చిరంజీవి అంటే తెలియని వారుండరు.. తొంభై ఏళ్ల పండు ముదుసలి నుండి మూడేళ్ల పిల్లాడి వరకు అందరికీ తెలిసిన హీరో చిరంజీవి పుట్టిన రోజు నేడు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నేడు పండగ రోజు. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులంతా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో మునిగి పోయారు.
chiru1 1955, ఆగస్టు 22న జన్మించిన చిరంజీవి నేడు 62వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. చిరంజీవి పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఆయనలో ఉన్న స్పీడ్. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా ‘బ్రేక్ డ్యాన్స్’ చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది. దక్షిణాది హీరోలలో డాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు.

చిరంజీవి సినిమా ప్రస్థానం 1978లో పునాది రాళ్లు సినిమాతో మొదలైంది. అయితే ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అవడంతో ఇదే మొదటి సినిమాగా ముద్రపడింది. మొదటిసారి చిరంజీవి తీసుకున్న పారితోషికం 1,116 రూపాయలు. మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించాడు.

chiranjeevi NTR

ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలద్రొక్కుకున్నాడు. ఇంకా చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందగా, గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమయిన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1980, 90లలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్భాందవుడు వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా చేశాడు.తరువాత కొంతకాలం చిరంజీవి సినిమాలు అంతగా విజయవంతంగా నడువ లేదు.

మళ్ళీ 1990 దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002లో వచ్చిన ఇంద్ర, ఠాగూర్ సినిమాలు తారా పధంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్ళింది. తరువాత వచ్చిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ వంటి సినిమాలు విజయవంతాలైనా గాని సినిమా బడ్జెట్‌లు విపరీతంగా పెరిగి పోవడం వలనా, ప్రేక్షకుల అంచనాలు అతిగా ఉండడం వలన, రంగంలో తీవ్రమైన పోటీ నెలకొనడం వలన అంత పెద్ద హిట్‌లుగా పరిగణించబడడం లేదు.

chiru2

ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి. 2008 ఆగస్టు 17 తన రాజకీయ ప్రవేశ విషయాన్ని పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేసారు. 2008 ఆగస్టు 26 న బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించటం జరిగింది. ప్రస్తుతానికి సినిమాలు తీసే ఆలోచనలు ప్రక్కన పెట్టినట్లు ప్రకటించారు. 2009 ఎన్నికల్లో పెద్దగా గెలుచుకోకపోవడంతో 2011 ఫిభ్రవరి 6 వతేదీన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. ఆ తరువాత రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయిన చిరంజీవి.. కేంద్రమంత్రిగానూ పనిచేశాడు. తరువాత రాజకీయాలను పక్కన పెట్టేసి 150వ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆఫ్టర్ ఎ గ్యాప్… బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ 150వ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. పదేళ్ళ విరామం తరువాత మెగాస్టార్ సినిమా రావడంతో అభిమాన ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటాయి. చిరు రీఎంట్రీతో బాక్సాఫీసును షేక్ చేశాడు. ప్రస్తుతం 151వ సినిమాలో నటించేందుకు సిద్దమవుతున్నాడు.

Chiranjeevi to be AP's CM candidate in 2019

చిరంజీవికి ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి. ‘నా దృష్టిలో పర్‌ఫెక్ట్‌ హీరోయిన్‌ అంటే ఆమె. అందంతో పాటుగా వృత్తి పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి’ అని చిరంజీవి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చిరంజీవికి అబాకస్‌, సుడోకు లాంటి పజిల్ గేమ్స్ తో పాటు చెస్ అంటే చాలా ఇష్టం. ఇవి ఆడటం ద్వారా మెదడు చురుకుగా తయారవుతుందని చిరంజీవి అంటుంటారు. నా చేతి రాత అస్సలు బావుండదు. ఎంత బావుండదంటే- నేను రాసిన దాన్ని నేనే మళ్లీ చదవలేను. సమయం దొరికినప్పుడల్లా చేతి రాతను మళ్లీ ప్రాక్టీసు చేస్తుంటాను అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

- Advertisement -