మెగాస్టార్ చిరంజీవి ప్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా జిల్లా కైకలూరు మండలం అటపాకలో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉదయం నుంచి చిరంజీవి అభిమాన సంఘాలు, రహదారులపై నిరసనలకు దిగారు. కావాలనే తమ అభిమాన హీరో పోస్టర్స్ చించివేశారని యువత ఆందోళనకు దిగడంతో భీమవరం- కైకలూరు రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, నిరసనలను విరమించేందుకు అభిమానులు ససేమిరా అన్నారు.
అభిమానుల ఆందోళనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితులను గుర్తించేందుకు చర్యలు తీసుకున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వంగవీటి రంగా పోస్టర్స్ కూడా చింపి వేయడంతో రంగా అభిమానులు కూడా అందోళనకు దిగారు. అయితే ఆకతాయిలు ఇలాంటి పని చేశారా లేక గొడవలు సృష్టించాలనే నేపంతో దుండగులు ప్లెక్సీలను ధ్వంసం చేశార అనే కోణంలో పోలీసులు విచారస్తున్నారు.