కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ ఇటీవలే థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. తీవ్రవాదం ఎన్.ఐ.ఏ ఆపరేషన్ నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే స్పై థ్రిల్లర్ ఇది. క్రిటిక్స్ ప్రశంసలతో పాటు సెలబ్రిటీ సహోదరుల ప్రశంసలు ఈ సినిమాకి దక్కుతున్నాయి. ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇదని చెప్పారు.
‘ఇప్పుడే వైల్డ్‌డాగ్ చూశాను. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుకవున్న కిరాతకులని పట్టుకున్న ఆ ఆపరేషన్ని కళ్లకి కట్టినట్టుగా చూపించారు’ అని చిరంజీవి పేర్కొన్నారు. ‘ఆ ఆవేశాన్ని, ప్రాణాలకి తెగించి ఆ నీచుల్ని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోలని, ఆ రియల్ హీరోలని మరింత అద్భుతంగా చూపించిన నా సోదరుడు నాగార్జునని, వైల్డ్ డాగ్ టీంని, దర్శకుడు సోలోమాన్, నిర్మాత నిరంజన్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ఇది ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లో ఒకటి కాదు.. ప్రతి ఒక్క భారతీయుడు, తెలుగు వారు గర్వంగా చూడాల్సిన చిత్రం. డోంట్ మిస్ దిస్ వైల్డ్ డాగ్! వాచ్ ఇట్!!’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు.