అంతరిక్షంలోకి ప్రయాణం చేయబోతున్న బండ్ల శిరీషకు మెగాస్టార్ చిరంజీవీ విషెస్ చెప్పారు. అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఈ నెల 11న ఓ వ్యోమనౌకను నింగిలోకి పంపబోతోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్, మరో ఇద్దరితో కలిసి తెలుగు మూలాలున్న యువతి బండ్ల శిరీష అంతరిక్షంలోకి వెళ్లబోతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష.. వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనతను అందుకున్న తొలి తెలుగు మూలాలున్న మహిళగా శిరీష చరిత్ర సృష్టించనున్నారు.
ఈ నేపథ్యంలో ఆమెకు తెలుగు వారి నుంచి శుభాకాంక్షల వెల్లువ వస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరు తన ట్విట్టర్ ఖాతాలో ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆమె గొప్ప కార్యానికి సిద్ధమైందని ఆయన అన్నారు. తారలను చేరుకుంటోన్న మొదటి తెలుగు అమ్మాయి శిరీష అని ఆయన గుర్తు చేశారు. ఆమె తల్లిదండ్రులు, తెలుగువారితో పాటు భారతీయులందరూ గర్వపడే సమయం ఇది అని ఆయన అన్నారు. ఈ మిషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చిరు చెప్పారు.