కొందరు తల్లితండ్రులు తమ పిల్లల్ని డాక్టరో..ఇంజనీరో చేయాలని..వారిని చిన్నప్పటీ నుండి ప్రొత్సాహిస్తారు. అదే చైనాలో అయితే మూడేండ్ల పిల్లల్ని ఏకంగా సీఈవోనే చేయాలని చూస్తున్నారు అక్కడి తల్లితండ్రులు. అందుకే ఏబీసీడీ…లతోపాటే సీఈవో పాఠాలను కూడా నేర్పిస్తున్నారు. అంటే పెద్దయ్యాక ఎలాగూ సీఈవోలు అవుతారని ఇప్పటినుండే ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాయి అక్కడి స్కూళ్లు.
చైనాలోని గ్వాంగ్‌జౌ నగరంలోని ఓ స్కూల్ మూడేళ్ల చిన్నారులకు ప్రత్యేకంగా ‘సీఈవో’ క్లాస్‌లను నిర్వహిస్తోంది. చిన్నతనంలోనే వ్యాపార విషయాలు.. అందులోని ఎత్తుపల్లాలు తెలుసుకుంటే.. పెద్దయ్యాక ఎలాంటి వ్యాపార సమస్యలైనా పరిష్కరించగలరని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. ఈ తరగతుల్లో భాగంగా బొమ్మ ఇటుకలతో నిర్మాణాలు, స్టాక్ మార్కెట్లపై అవగాహన పెంపొందించడం, ఒక వాక్యంలో పదాలు సరిచేయడం వంటివి నేర్పిస్తారు. అంతేకాదు ‘సీఈవో’ స్థాయిలో ఉన్నప్పుడు సంపన్నులుగా మారుతారు. అందుకే సంపన్నులు ఎక్కువగా ఆడే గోల్ఫ్ లాంటి క్రీడలు కూడా నేర్పిస్తారు.
చైనాలో అత్యధిక ఫీజు ఈ కోర్సుకే వసూలు చేస్తున్నారు. ఏడాదికి రూ. 5లక్షలు ఉంటుందని చెబుతున్నారు. అయినా చాలా కుటుంబాలు తమ పిల్లల్ని ఈ కోర్సులో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే ఈ కోర్సుకు క్రేజ్ బాగా పెరగడంతో ఇటీవల కాలంలో కోర్సుపై విద్యాసంస్థలు ఎక్కువయ్యాయి.