గత కొద్ది నెలులగా కరోనా మహ్మమారి ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ పుట్టిన చైనాలో మాత్రం కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. వైరస్ వ్యాప్తితో షాంఘైతోపాటు పలు ముఖ్య నగరాలలో పూర్తిగా లాక్‌డౌన్ విధించారు. రెండు నెలల క్రితం తొలిసారి షెంఝేన్ నగరంలో ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాతి నుంచి పలు నగరాలు క్రమంగా ఆంక్షలు కొన్నసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో 40 కోట్ల మంది లాక్‌డౌన్‌లో ఇరుక్కున్నారు.
చైనాలోని వాణిజ్యనగరమైన గువాన్‌ఝౌలో పాఠశాలలను మూసేశారు. నిన్నమొన్నటి వరకు కరోనా ఆంక్షలు అమల్లో ఉన్న జిలిన్ ప్రావిన్స్‌తోపాటు సుజౌ, టాంగ్‌షాన్ వంటి ప్రావిన్సుల్లో కరోనా వ్యాప్తి కొంత అదుపులోకి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా,ప్రస్తుతం 100 ప్రధాన నగరాల్లోని 87 చోట్ల కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి. కున్‌షాన్ నగరంలో గత వారం ఆంక్షలు విధించడంతో తైవాన్ టెక్ కంపెనీలు మూతపడ్డాయి. షాన్‌షీ ప్రావిన్స్ రాజధాని తైయువాన్‌లోనూ కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రావిన్సులోని ఆరు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు.