సమస్యలు పూర్తి నియంత్రణలోకి వచ్చాయి- చైనా

374
- Advertisement -

గత కొన్ని రోజులుగా భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత నెలకొంది. తూర్పు లదాక్ లో భారత్ నిర్మిస్తోన్న వ్యూహాత్మక రోడ్డును అడ్డుకునే క్రమంలో చైనా మన భూభాగంలోకి చొచ్చుకురావడం, కీలకమైన పాంగాంగ్ సరస్సు, హాట్ స్ప్రింగ్, గాల్వాన్ లోయలో భారత్ పోస్టులను చైనా చుట్టుముట్టడం, అక్కడ గస్తీ కాస్తోన్న భారత బలగాలను అడ్డుకునే ప్రయత్నం చేయడమే ఉద్రిక్తతలకు కారణమైంది. దీనిపై ఇరుదేశాల సైనికాధికారులు శనివారం చర్చలు కూడా జరిపారు.

భారత్ తరఫున లేహ్‌ 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్‌ జనరల్‌ హరిందర్‌ సింగ్‌, చైనా బృందానికి టిబెట్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ కమాండర్‌ లియు లిన్ నేతృత్వం వహించారు. అయితే, సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని, సమస్య పరిష్కారానికి పరస్పర సంప్రదింపులు కొనసాగించాలన్న అభిప్రాయానికి ఇరుపక్షాలు వచ్చాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్ యింగ్ స్పందించారు. సరిహద్దుల వద్ద ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని, పరిస్థితులు చక్కబడ్డాయని తెలిపారు. జూన్ 6న జరిగిన సమావేశంలో చైనా, భారత్ సైనికాధికారులు అన్ని విషయాలు చర్చించారని వెల్లడించారు. సరిహద్దు ఉద్రిక్తతలు నివారించే క్రమంలో ఇరు దేశాలు దౌత్య, సైనిక పరమైన మార్గాల్లో పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకున్నాయని పేర్కొన్నారు.

సమస్యలు పూర్తి నియంత్రణలోకి వచ్చాయని, ఇలాంటి సమస్యలను పరిష్కరించుకునే సత్తా చైనా, భారత్ లకు ఉందని స్పష్టం చేశారు. సంప్రదింపులు, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇరుదేశాల నాయకత్వాలు ఎల్లప్పుడూ సుముఖంగానే ఉంటాయని హువా చున్ యింగ్ వివరించారు.

- Advertisement -