ముస్లిం, మైనార్టీల విద్యా వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. నాంపల్లిలో రూ. 20 కోట్ల వ్యయంతో ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయం, విద్యను అందించడం కోసం నిర్మించనున్న ‘అనీస్ ఉల్ గుర్భా’కు కేసీఆర్ ఇవాళ (జూన్ 18) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న అనీస్ ఉల్ గుర్భా నూతన భవనాన్ని గొప్పగా నిర్మించాలని పేర్కొన్నారు.
సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన ముస్లిం మైనార్టీల కోసం రాష్ట్రంలో 204 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అనాథ పిల్లలకు ఉపయోగపడే అనీస్ ఉల్ గుర్భా భవన నిర్మాణానికి పూనుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో 1921 నుంచి 60 మందికి ఆశ్రయం కల్పించే సామర్థ్యంతో అనీస్ ఉల్ గుర్భా నడుస్తోంది. కాగా, ఇటీవల రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అనీస్ ఉల్ గుర్భాకు చెందిన 191 గజాల స్థలం పోయింది. దీనికి బదులుగా ప్రభుత్వం 4 వేల గజాల స్థలాన్ని కేటాయించడంతో పాటు కొత్త భవనం నిర్మించడానికి రూ. 20 కోట్లు మంజూరు చేసింది.
ఏడు అంతస్తులతో 1.53 లక్షల చదరపు అడుగుల స్థలం నివాసయోగ్యంగా ఉండేటట్లు డిజైన్ రూపొందించారు. మొదటి రెండు ఫ్లోర్లు వాణిజ్య సముదాయానికి, మిగతా 5 ఫోర్లు అనాథ పిల్లల కోసం కేటాయిస్తారు. 500 మంది బాలబాలికలకు వేర్వేరుగా వసతి కల్పించనున్నారు. ఇందులో ఓ పాఠశాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థులకు ఇందులో ఆశ్రయం కల్పిస్తారు.
ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మహముద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, బలాలా, పాషాఖాద్రీ, మౌజంఖాన్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రెడ్డి, సలీమ్, ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ తదితరులు పాల్గొన్నారు.