పుట్టుకతోనే కొందరు అదృష్టవంతులుగా పుడుతుంటారు. అందుకు తాజాగా అమెరికాలో జరిగిన ఘటననే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో పుట్టిన ఓ చిన్నారికి రెస్టారెంట్ యాజమాన్యం బంఫర్ ఇచ్చింది. ఆ చిన్నారికి జీవితాంతం నచ్చిన ఆహారం అందిస్తామని ప్రకటించింది. భవిష్యత్ లో ఉద్యోగం చేయాలనుకున్నా.. తమ హోటల్ ఇస్తామని చెప్పింది. రెస్టారెంట్ ప్రకటనతో ఆ చిన్నారి తల్లిదండ్రులు సంబరపడిపోతున్నారు.
వివరాల్లోకి వెళితే.. టెక్సాస్ లోని శాన్ ఆంటోనియోలో మ్యాగీ గ్రిఫిన్-రాబర్ట్ దంపతులు నివసిస్తున్నారు. గర్భవతి అయిన మ్యాగీకి నొప్పులు వచ్చాయి. భర్త రాబర్ట్ ఆమెను ఆస్పత్రి తీసుకుని బయలు దేరాడు. పెద్ద కూతురిని ఓ రెస్టారెంట్ దగ్గర దించి వాష్ రూంకి వెళ్లింది మ్యాగీ. నొప్పులు ఎక్కువ కావడంతో అక్కడే పడిపోయింది.
భార్య అరుపులు విన్న రాబర్ట్, రెస్టారెంట్ మేనేజర్ వెళ్లి.. ఆమె డెలీవరికి అక్కడే ఏర్పాటు చేశారు. మ్యాగీ అక్కడే పండంటి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. అక్కడే నామకరణం కూడా చేశారు ‘మే వయొలెట్ గ్రిఫిన్’ గా పేరు పెట్టారు. ఈ విషయాన్ని రాబర్ట్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. సోషల్ మీడియాలో ఈ పోస్టు విపరీతంగా వైరల్ అయింది.
ఇక చిక్-ఫిల్-ఏ రెస్టారెంట్ రాబర్ట్ పోస్టును షేర్ చూస్తూ మేం భోజనమే కాదు.. డెలివరీ కూడా చేస్తాం అంటూ పోస్టు చేసింది. ఆ చిన్నారికి జీవితాంతం భోజనం ఫ్రీగా అందిస్తాం.. భవిష్యత్తులో ఉద్యోగం చేయాలనుకుంటే మా రెస్టారెంట్ లో ఉద్యోగం కూడా ఇస్తాం అంటూ పోస్టులో పేర్కొంది.