టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ చటేశ్వర్ పుజారా రికార్డు సృష్టించారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో డజన్ డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశారు. ఇప్పటివరకు 11 డబుల్ సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్న దిగ్గజ క్రికెటర్ విజయ్ మర్చంట్ పేరుమీదున్న రికార్డును తిరగరాశాడు.
జార్ఖండ్‌తో మ్యాచ్‌లో 355 బంతుల్లో 204 డబుల్ సెంచరీ చేయడంతో సౌరాష్ట్ర భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌ను ఆ జట్టు 553/9 వద్ద డిక్లేర్ చేసింది. చిరాగ్ జాని (108) సెంచరీ చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 52 పరుగులు చేసింది.
సునీల్ గావస్కర్, విజయ్ హజారే, రాహుల్ ద్రవిడ్‌లు పదేసి డబుల్ సెంచరీలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరిలో మూడు ట్రిపుల్ శతకాలు బాదిన ఏకైక ఆటగాడు పుజారానే. రవీంద్ర జడేజా మాత్రమే అతడితో సమానంగా మూడు త్రిశతకాలు కొట్టాడు.
ద్రావిడ్ తర్వాత టీమిండియాకు వెన్నెముకగా మారిన పుజారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్ లో భారత్ తరపున అత్యధిక బంతులు (525 బంతులు) ఎదుర్కొన్న భారత్ ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా ద వాల్ రాహుల్ ద్రవిడ్ 495 బంతుల రికార్డును పుజారా అధిగమించాడు. 2004లో రావల్పిండిలో పాకిస్తాన్ తో జరిగిన టెస్టులో ద్రవిడ్ ఈ ఫీట్ ను సాధించాడు.