అధికారిక పర్యటన లో భాగంగా లండన్ వెళ్లిన ఎంపీ కవిత గారికి, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ( టాక్) సంస్థ ప్రతినిధులు కలిసి ఈ సంవత్సరం నిర్వహించబోయే బతుకమ్మ పండగను “చేనేత బతుకమ్మ” గా ప్రకటించి వేడుకలని నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
బతుకమ్మ అంటేనే అందరి బతుకును కోరుకొనే పండగని, తెలంగాణ ప్రజలు మాత్రమే జరుపుకొనే ప్రత్యేకమైన ఉత్సవమని. నేడు క్షేత్రస్థాయి నుండి ప్రపంచ నలుమూలల మన బతుకమ్మ ఆటను పాటను ఇంటింటికి తీసుకెళ్లిన గొప్ప నాయకురాలి గా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా కవిత పాత్ర సమాజం ఎప్పటికి మరువలేనిది, చరిత్రలో అది చిరస్మరణీయమని కావున బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన కవిత గారు చేనేత బతుకమ్మకు పిలుపునివ్వాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ నాయకత్వం లో చేనేత కార్మికుల పట్ల ఎంతో చిత్తశుద్ధి తో, వారి మెరుగైన భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేస్తున్నారని , అదే స్ఫూర్తి తో కవిత పిలుపునివ్వాలని కోరారు.ఖచ్చితంగా యావత్ తెలంగాణ సమాజం మీ పిలుపుతో స్పందించి, నేతన్నలని ఆదుకోవడానికి ముందుకు వస్తారని, కాబట్టి 2017 బతుకమ్మకు “చేనేత బతుకమ్మ” అనే పేరుతో ప్రజలను చేనేత వస్త్రాలతో పండగ జరుపుకొనేలా ప్రోత్సహిస్తే, నేతన్నల అభివృద్ధి కూడా ఊరూరా ఉద్యమం లా జరుగుతుందని ఆశిస్తున్నట్టు, ఈ పిలుపు వల్ల వివిధ వర్గాలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి కొనుగోళ్లు చేయడం ద్వారా నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపినవారవుతారని టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది తెలిపారు.
చేనేత బతుకమ్మ ద్వారా ఖచ్చితంగా చేనేత రంగాన్ని ఆదుకున్న వారమవుతామని అడ్వై సరి బోర్డు చైర్మన్ గోపాల్ మేకల తెలిపారు. ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది తో పాటు మహిళా ప్రతినిధులు స్వాతి బుడగం, సుమా విక్రమ్, విజయ లక్ష్మి, శ్రీ శ్రావ్య, అపర్ణ మరియు ఇతర ప్రవాస మిత్రులు నాగ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.