రోజా, బాంబే , ఘర్షణ , నాయకుడు, సఖీ లాంటి విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నాడు మణిరత్నం. ఆయన సినిమాలు సున్నితమైన భావోద్వేగంతో కూడుకుని ఉంటాయి. కొంతకాలంగా సరైన హిట్ లేని మణిరత్నం ఒకే బంగారం సినిమాతో హిట్ కొట్టాడు. తాజాగా కార్తీ, అదితి రావు జంటగా ఓ అందమైన ప్రేమకథను చెలియా రూపంలో ఏప్రిల్ 7 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ వార్ నేపథ్యంలో ఓ ఫైటర్ పైలట్, డాక్టర్ మధ్య జరిగిన ప్రేమ కథ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో తెలుసుకోవాలంటే ముందు అసలు సినిమా కథ ఏంటనే విషయాన్ని తెలుసుకొందాం.
కథ:
వరుణ్(కార్తీ) అలియాస్ వీసీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో స్వాడ్రన్ లీడర్గా పనిచేస్తుంటాడు. అనుకోని ఆక్సిడెంట్ తో తీవ్ర గాయపడిన వరుణ్ హాస్పిటల్‌లో చేర్చుతారు అధికారులు. హీరోయిన్ లీలా(అదితిరావు హైదరి) అదే హాస్పిటల్‌లో డాక్టర్‌గా విధుల్లో చేరుతుంది. వరుణ్‌కి లీలా వైద్యం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో లీలాను చూసి ఇష్టపడుతాడు. ఆ తర్వాత మారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. తమ ప్రేమలో కలతలు, కలహాలు చోటుచేసుకొంటాయి. ఈ సందర్భంలో వారిద్దరూ విడిపోతారు. అదే సమయంలో యుద్ధం చోటుచేసుకోవడంతో ఫైటర్ పైలట్‌గా తన కర్తవ్యాన్ని నిర్వహించేందుకు కార్గిల్‌కు వెళుతాడు. యుద్ధంలో విమానం కూలి పాకిస్థాన్ సైన్యానికి బందీగా చిక్కుతాడు. రావల్పిండి జైలులో వరుణ్ తన ప్రేమికురాలు లీలా అబ్రహం గురించి తలుచుకొంటూ బతుకుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వరుణ్ పాకిస్థాన్ జైలు నుంచి బయటపడ్డాడా? తన ప్రేమికురాలు లీలాను కలుసుకొన్నాడా? చివరికి కథకు ముగింపు ఏంటనే ప్రశ్నలకు సమాధానమే చెలియా చిత్రం.
ప్లస్ పాయింట్స్:
కార్గిల్ యుద్ద నేపథ్యంగా పైలట్, డాక్టర్ మధ్య పీరియాడిక్ లవ్ స్టోరిని దర్శకుడు మణిరత్నం ఎంచుకొన్నారు. ఈ కథ 1999 కార్గిల్ యుద్దానికి సంబందించిన సన్నివేశాలతో చిత్రం మొదలై, పాకిస్థాన్ అధికారులకు బందీగా చిక్కిన వరుణ్ జైలు జీవితాన్ని అనుభవిస్తూ తన ప్రేయసి ఊహాల్లో గడుతుంటాడు. అదే సమయంలో జైలు నుంచి తప్పించుకోవడం ఎలా అనే ఆలోచనతో.. రెండు కోణాల్లో కథ నడుస్తూ ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుంటుంది.
ఇటీవల విభిన్నమైన చిత్రాలు, పాత్రల్లో కనిపించిన కార్తీకి చెలియా చిత్రం మరో డిఫరెంట్ మూవీ. పైలట్ పాత్రలో కార్తీ చక్కగా ఒదిగిపోయాడు. పైలట్‌గా, ప్రేమికుడిగా, యుద్ధ ఖైదీగా తన పాత్రకు వందశాతం న్యాయం చేకూర్చాడు. కీలక సన్నివేశాల్లో మంచి నటనను కనబరిచాడు. రొమాంటిక్ సీన్లలోనూ అదరగొట్టాడు. టోటల్‌గా కార్తీ కెరీర్‌లో ఓ మంచి చిత్రమని చెప్పవచ్చు. లీలా అబ్రహం పాత్ర భిన్న కోణాలున్న పాత్ర. ఎమోషనల్, ప్రేమ, విరహం లాంటి అంశాలు మేలవించిన పాత్రలో అదితి చక్కటి ప్రతిభ కనబరిచింది. అందం, అభినయంతో ప్రేక్షకుడిని కట్టపడేస్తుంది.
మైనస్ పాయింట్స్:
కథలో దమ్ము లేకపోవడం, కథనం మందగించడం వల్ల మణిరత్నం తన స్థాయిలో సినిమాను తెరకెక్కించడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. సెకాండాఫ్‌లో వరుణ్, లీలా ప్రేమ కథను సాగతీయడంతో రెండో భాగంలో క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందా అనే భావన ప్రేక్షకుడి కలుగుతుంది. సెకండాఫ్‌లో సన్నివేశాలు కూడా అంతగా ఆసక్తి లేకపోవడం కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ఎలాంటి భావోద్వేగ సన్నివేశాలు లేకపోవడం.. కథ రొటీన్‌గా సాగిపోవడంతో చివరకు ఇది రోజా, బొంబాయి తరహా చిత్రం కాదని తేలిపోతుంది. మణిరత్నం నుంచి వచ్చిన సాదాసీదా ప్రేమకథ అని ప్రేక్షకుడికి అర్థమైపోతుంది.
సాంకేతిక విభాగం:
కథకు అనుగుణంగా కశ్మీర్‌లోని అందమైన లొకేషన్లను జోడించి దృశ్యకావ్యంగా మలిచేందుకు ప్రయత్నించారు మణిరత్నం. రవి వర్మన్ ఫొటోగ్రఫీ అద్బుతం.. సినిమా స్ధాయికి తగ్గట్టుగా ఉంది. కశ్మీర్ లొకేషన్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు పర్వాలేదనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా వచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
ఓవరాల్‌గా చెలియా సినిమా స్లోగా ఉన్నా మణిరత్నం సినిమాల్లో సున్నితమైన ప్రేమతో పాటు బలమైన భావోద్వేగాలు ఉంటాయి. ఇక కార్తీ – అతిథిరావు హైదరీ జోడీతో పాటు అందమైన లొకేషన్లలో సినిమాను చిత్రీకరించడం సినిమాకు ప్లస్ పాయింట్లు కాగా స్లో స్లో నెరేషన్, వీక్ సెకండాఫ్ సినిమాకు మెయిన్ మైనస్‌లుగా ఉన్నాయి. ఓవరాల్‌గా రోజా, బొంబాయి, సఖి లాంటి రేంజ్‌లో చిత్రాలను ఆశించిన ప్రేక్షకులకు కొంత అసంతృప్తినే మిగిల్చారు.
విడుదల తేదీ: 07/04/2017
రేటింగ్:3 /5
నటీనటులు: కార్తీ, అతిదిరావు హైదరీ
సంగీతం: ఏఆర్ రెహ్మాన్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: మణిరత్నం