మానేరు నదిపై లోయర్ మానేరు డ్యాంకు దిగువన కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం, తనుగుల గ్రామం వద్ద నిర్మించిన చెక్ డ్యాంను స్థానిక ఇసుక మాఫియా జిలెటిన్ స్టిక్స్ తో 21 నవంబర్ రాత్రి 10 గంటల ప్రాంతంలో పేల్చివేసిన సంఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి , దోషులను గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాలని , సంఘటనా స్థలాన్ని శుక్రవారం నాడు సందర్శించిన రాష్ట్ర స్థాయి నిజ నిర్దారణ కమిటి డిమాండ్ చేసింది. సాగు నీటి రంగ నిపుణులు వి ప్రకాష్ నాయకత్వంలో ఎర్పాటైన నిజ నిర్ధారణ కమిటిలో విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, సాగునీటి శాఖ విశ్రాంత ఇంజనీర్లు, సీనియర్ జర్నలిస్టులు, తెలంగాణా వికాస సమితి ప్రతినిధులు తదితరులు ఉన్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బృందం సంఘటనా స్థలంతో పాటు వివిధ గ్రామాల రైతులను కలిసి పూర్తి స్థాయి విచారణ నిర్వహించింది. ఈ సంఘటన వెనుక భారీ కుట్ర దాగి ఉన్నట్టు నిజ నిర్ధారణ కమిటి అభిప్రాయపడుతున్నది. మానేరు నదిపై వరుస చెక్ డ్యాంల నిర్మాణంతో అక్రమ ఇసుక రవాణాకు ఆటంకాలు తల ఎత్తడం వలన, చెక్ డ్యాం లలో నీటి నిల్వలను తొలగించి యధేచ్చగా ఇసుక అక్రమ రవాణాను కొనసాగించుకునే కుట్రలో భాగంగానే తనుగుల చెక్ డ్యాం ను డిటోనెటర్లు అమర్చి భారీ విస్పోటనం జరిపినట్టు సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలను అనుసరించి నిజ నిర్ధారణ కమిటి అభిప్రాయపడుతున్నది.
ఈ సంఘటనపై సాగునీటి శాఖ అధికారులు చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం, దోషులను గుర్తించకపోవడం, ఈ సంఘటన వెనుక రాష్ట్ర స్థాయిలో పలుకుబడి కలిగిన ప్రముఖుల హస్తం ఉన్నట్టు అనుమానించాల్సి వస్తున్నదని కమిటి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నది.
ఈ సంఘటనపై ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండానే కేంద్ర హోమ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తదితరులు నిర్మాణంలో నాణ్యతా లోపాల వల్లనే చెక్ డ్యాం కూలిందని ప్రకటించడం అసలైన దోషులను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అనుమానించాల్సి వస్తున్నదని నిజ నిర్ధారణ కమిటి ఆరోపించింది. సంఘటనా స్థలంలో చెక్ డ్యాం అనేక ముక్కలుగా పగిలిపోయి విరిగిపడిన తీరు సంఘటన జరిగిన రోజు రాత్రి భారీ శబ్దాలు వినిపించినట్టు సమీప గ్రామాల ప్రజలు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు, సంఘటన జరిగిన ప్రదేశంలో చుట్టుపక్కల ఇసుక తిన్నెలపై భారీ సంఖ్యలో చేపలు చనిపోయిన తీరు, తదితర పరిస్థితులను బట్టి చెక్ డ్యాం పేల్చివేత వల్లనే కూలిందని అనుమానించవలసి వస్తున్నదని కమిటి అభిప్రాయపడింది.
సుమారు రెండు సంవత్సరాల క్రితం పెద్దపల్లి మండలం హుసేన్ మియా వాగుపై నిర్మించిన చెక్ డ్యాం ను పేల్చి వేసేందుకు ఇసుక మాఫియా చేసిన ప్రయత్నాలను స్థానిక రైతులు అడ్డుకున్నప్పుడు సంఘటనా స్థలంలో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, కంప్రేశర్ మెషీన్ లు తదితర పేలుడు పదార్థాలు లభించినప్పటికీ ఇంత వరకు పోలీసులు దోషులను గుర్తించక పోవడం, ఆలాగే మేడిగడ్డ వద్ద కూడా పెల్చివేతపై వచ్చిన ఫిర్యాదుపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, తిరిగి ఆలాంటి సంఘటనే తనుగుల చెక్ డ్యాం వద్ద జరగడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని కమిటి అభిప్రాయపడింది. ఈ సంఘటనలన్నిటి పైన సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని నిజ నిర్ధారణ కమిటి డిమాండ్ చేసింది.
నిజ నిర్ధారణ కమిటి సభ్యులు :
1. వి ప్రకాష్, తెలంగాణా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్,
2. ప్రొ సీతారామారావు, అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటి మాజీ ఉప కులపతి
3. ప్రొ రాఘవ రెడ్డి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
4. Er దామోదర్ రెడ్డి, విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజనీర్, సాగునీటి శాఖ
5. Er శ్రీధర్ రావు దేశ్పాండే , విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజనీర్, సాగునీటి శాఖ
6. పిట్టల రవీందర్, సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణా JAC మాజీ రాష్ట్ర కోఆర్దినేటర్
7. ఎర్రోజు శ్రీనివాస్, తెలంగాణా వికాస సమితి రాష్ట్ర కార్యదర్శి
8. మల్లావజుల విజయానంద్, తెలంగాణా వికాస సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు
9. బుచ్చన్న, సీనియర్ జర్నలిస్టు
10. శంకర్, సీనియర్ జర్నలిస్టు
11. సలీం , సీనియర్ జర్నలిస్ట్
Also Read:‘సైక్ సిద్ధార్థ’..అందరికీ నచ్చుతుంది!

