గోవాలోని డబ్ల్యూ రిసార్ట్ వేదికగా టాలీవుడ్ ప్రేమజంట చైతూ – సమంత పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని, దగ్గుబాటి, సమంత కుటుంబాలకు చెందిన అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో సమంత మెడలో మూడు ముళ్లు వేశాడు నాగచైతన్య. ఇక అభిమానులు వీరి రిసెప్షన్ ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ నేపథ్యంలో అందరి సమక్షంలో ఆదివారం గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించారు.
నాగ చైతన్య, సమంతల వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా కొనసాగింది. కొత్త జంటతో పాటు అక్కినేని, దగ్గుబాటి కుటుంబసభ్యులు వేదిక వద్దకు చేరుకున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వేడుకకు తరలి వచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ దంపతులు, కృష్ణంరాజు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రాఘవేంద్రరావు, నందమూరి హరికృష్ణ, రాజమౌళి, కీరవాణి, హీరో కార్తీ, జయసుధ, నరేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, శివాజీ రాజా, ఉత్తేజ్, ఆర్ నారాయణమూర్తి తదితరులు వధూవరులను ఆశీర్వదించారు.