‘చారు’కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

31
- Advertisement -

మనం రోజు తినే అన్నంలో ఓ కూర, పచ్చడి, పెరుగు లాంటివి ఉన్నా సరే… పులుసు లేదా చారు లేకపోతే కొందరికి కడుపునిండా భోజనం చేసినట్లుగా ఉండదు. 20 సంవత్సరాల క్రితం వరకు ఏ పల్లెకెల్లినా, ఎవరి ఇంట్లో చూసినా వారి వంటకాల్లో తప్పనిసరిగా చారు ఉండాల్సిందే. ఎంతరుచికరమైన భోజం ఉన్నా చారు ముద్ద లేదంటే ఏదో వెళితే. నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఉండే అసలైన చింతపండు చారు..చదువుతుంటేనే ఊరిలోస్తున్నాయింటే…అదే చారు కుండే ప్రత్యేకత . అయితే అలాంటి చారుకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?.

చింతపండు,ఇంగువ,పోపు దినుసులు,ఉప్పు ఈ నాలుగు ఉంటే చాలు చారు క్షణాల్లో తయారై పోతుంది. ఇంత సులభంగా తయారైంది కాబట్టే దీనిని చారు అన్నారేమో. ఇక చారును ఎందులో కలిపితే దాని పేరు అలానే మారిపోతుంది. పప్పేస్తే పప్పు చారు,టమాటాలతో టమాటా చారు,మునగేస్తే మునగచారు,మిరియం వేస్తే మిరియాల చారూ ఇలా ఇప్పుడైతే చారులో చాలా వెరైటీలు వచ్చాయనుకోండి. చికెన్ చారు, మటన్ చారు,

ఇలా దేనిని తగిలిస్తే దానితో కలగలిసిపోయి తన రుచిని దానికిచ్చేసి దాని పసని తనలో కలిపేసుకుని వేడి వేడిగా తాగినవాడిలో కొత్త ఉత్తేజాన్ని నింపేస్తుంది చారు. పళ్ళు రాని పాపడి నుంచి పళ్ళూడిన తాత దాకా మరి మెచ్చేదే చారూ బువ్వ. అన్న ప్రాసన తర్వాత రుచులు అలవాటయ్యేది చారుతోటే. మారాం చేసే బుజ్జి గాడికి గోరుముద్దలు తినిపించేది చారుగుజ్జు తోనే…అందుకే ఒక్కసారి చారు టేస్ట్ చూస్తే దానిని మర్చిపోరంతే.

కొంతమందికి ఉప్మా నచ్చదు. అయితే దాంట్లో రెండు చెంచాల చారు కలుపుకొండి…అమృతమే. ఇంట్లో శ్రీమతికి కోపం వచ్చిందంటే(వస్తేనూ) కంచంలో తగిలేవి చారునీళ్ళే… అంతే కాదండోయ్ ప్రేమగా పెడితే చారంత రుచికరమైన వంటకం మరోటి ఉంటుందా. ఇంట్లో పెద్దాళ్ళకి జలుబు పట్టిందంటే…మరింక ఆ రోజు అందరికీ చారు భోజనమే. చారు అంటే అందమైనది అద్భుతమైనది అని.. అలాగే చారు బాగా కాచగలిగిన ఇల్లాలిని చారుశీల అనీ, చారు లేందే ముద్ద దిగని భర్తను చారుదత్తుడు అని అంటే తప్పా… చెప్పండి. వేడి వేడి చారు పొగలు గ్రక్కుతూ ఇంగువ ఘాటుతో కరివేపాకు ఘుమఘుమలు ముక్కుకు తగుల్తూ ఉంటే దాని ముందు అన్ని పేరొందిన ద్రవపదార్థాలు దిగదుడుపే… మరి కొత్తిమీర త్రుంచివేసి, కాచిన చారైతే మరింత రుచి… అద్భుతః, అమోఘః……

కాఫీకి ముందు మన పూర్వీకులు చారే కాచుకు తాగేవారని ఓ నానుడీ. చారు రుచి ప్రాంతాన్ని బట్టి మారుతుంది…. గుంటూరు ఘాటు మిర్చితో పెట్టిన చారుదొక తీరు… ఉత్తరాంధ్రలో బెల్లంతో పెట్టిన చారే వేరు….ఇలా చెప్పుకుంటూ పోతే.. వేడి వేడిగా గొంతులో జారు.. చెవులనుండి వచ్చు హోరు..జలుబు దగ్గులు ఓ గుటకతో తీరు. తల్లిలేని పిల్లవాని బ్రతుకు, భార్యలేనివాని యవ్వనం, శాంతం లేని ఋషి తపస్సు ఇవన్నీ ‘చారు’ లేని భోజనంలా నిష్ఫలం..ఒక్కసారి మీరు చారుతో భోజనం చేయడం..జన్మలో మర్చిపోరు.

Also Read:ఎంపీ స్థానాల్లో గెలుపుకు కృషిచేయాలి:సీఎం రేవంత్

- Advertisement -