చంద్రయాన్‌-2 కౌంట్‌డౌన్‌ ప్రారంభం..

325
- Advertisement -

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌–2 రాకెట్‌ ఈ నెల 22వ తేదీన సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రమైన షార్‌ నుంచి నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహక నౌకను ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. రాకెట్‌ సన్నద్ధత సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

షార్‌లోని కల్పన అతిథి గృహంలో శనివారం ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్సు విధానంలో జరిగింది. దీనిలో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఈ వాహక నౌక ప్రయోగంపైనే ప్రధానంగా చర్చించారు. ఇంతకు ముందు క్రయోజెనిక్‌ దశలో వచ్చిన సాంకేతిక లోపంతో ఈనెల 15న ప్రయోగానికి 56 నిమిషాల ముందు దీనిని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ లోపాన్ని ఎలా అధిగమించారు, మున్ముందు ఇలాంటివి తలెత్తకుండా తీసుకున్న చర్యలేమిటి, అయిదు రోజుల వ్యవధిలో చేసిన పనులపై సమావేశంలో సమీక్షించారు.

Chandrayaan 2

అనంతరం పొద్దు పోయేవరకు లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) సమావేశం జరిగింది. ల్యాబ్‌ ఛైర్మన్‌గా ఉన్న రాజరాజన్‌.. వాహక నౌక ప్రయోగానికి ఈ సమావేశంలో అనుమతి ఇచ్చారు. కౌంట్‌డౌన్‌ ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది 20 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగిన తరువాత జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక 3.8 టన్నుల బరువు గల చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని రోదసిలోకి మోసుకెళ్లనుంది.

ఇక ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు సందర్శకుల కోసం భారీ గ్యాలరీని అధికారులు సిద్ధం చేశారు. ప్రయోగ వేదికకు సమీపంలోని శబరి గిరిజన కాలనీ ప్రాంతంలో సుమారు 60 ఎకరాల అటవీ భూమిలో ఈ గ్యాలరీని నిర్మించారు. దీంట్లో సుమారు 5 వేల మంది సందర్శకులు కూర్చుని రాకెట్ ప్రయోగాన్ని వీక్షించవచ్చు. ఈ నెల 15న చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా పడడంతో రాకెట్ లాంచింగ్‌ను చూడాలనుకున్న వీక్షకులకు నిరాశే మిగిలింది. అయితే, గతంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వాళ్లకు ఇచ్చిన సీరియల్ నంబర్లతో పాసులు తీసుకొని ఈ నెల 22న ప్రయోగాన్ని సందర్శకులు వీక్షించవచ్చని ఇస్రో పేర్కొంది.

- Advertisement -