రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: చంద్ర శేఖర్ గౌడ్

17
- Advertisement -

రహదారి ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆర్మూర్ లో జరిగిన రహదారి భద్రతపై అవగాహన సదస్సులో ముఖ్యఅతిథి గా ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ 75% శాతం రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయని మిగిలిన 25% వాహన కండిషన్ బాగా లేకపోవడం వల్ల రోడ్డు కండిషన్ బాగా లేకపోవడం వల్ల జరుగుతున్నాయని తెలిపారు.

పరిమితికి మించిన వేగంతో వాహనం నడపడం వల్ల ,త్రాగి వాహనం నడపడం వల్ల ,సెల్ ఫోన్తో డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని కాబట్టి వీటిని నివారించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ముఖ్యం గా యువత ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తుండడం మనందరికీ ఆందోళన కలిగిస్తున్న అంశమని తెలిపారు.

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ,రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్ గారు , రవాణా కమిషనర్ సురేంద్ర మోహన్ గారి ఆదేశాల మేరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.

అవగాహన సదస్సులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను కూడా నిర్వహిస్తున్నామని , త్రైమాసిక పన్ను చెల్లించని వాహన దారులు జనవరి 30 లోపల పన్ను చెల్లించాలని ,లేనిపక్షంలో తనిఖీల్లో పట్టుబడితే భారీ జరిమానా తో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ జిల్లా లో వివిధ శాఖ ల సమన్వయం తో రోడ్డు ప్రమాదాల నివారణ కు కృషి చేస్తున్నామన్నారు.

ఆర్మూర్ మోటారు వాహన తనిఖీ అధికార వివేకానంద రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, ప్రతి వాహనం ఫిట్ నెస్ కలిగి ఉండాలని, వాహనం నడిపే ప్రతీ డ్రైవర్, సంబంధిత డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఎంవీఐ లు రాహుల్ కుమార్, కిరణ్ కుమార్ . ఏ వో ప్రహ్లాద్ ఏ ఎం వి ఐ లు శ్రీనివాస్, సాగర్, పవన్ కళ్యాణ్ వివిధ వాహనాల డ్రైవర్లు, వాహన దారులు పాల్గొన్నారు.

Also Read:నామినేషన్‌ వేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌

- Advertisement -