చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి:సజ్జల

5
- Advertisement -

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతోనే ఈ వివాదం మొదలైందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జాతీయ స్థాయి ల్యాబ్ నివేదికల్లో లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని స్పష్టంగా తేలిందని ఆయన వివరించారు. రాజకీయ కక్షతోనే వైసీపీపై అన్యాయమైన ఆరోపణలు చేశారని ఆరోపించారు.

రాజకీయాలు ఎలా ఉన్నా, కోట్లాది మంది భక్తులు ఈ వ్యాఖ్యలతో తీవ్రంగా షాక్‌కు గురయ్యారని సజ్జల అన్నారు. మహా పాపానికి పాల్పడ్డానని భావించి చంద్రబాబు నాయుడు భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జంతువుల కొవ్వు లేదని తేలగానే ఇప్పుడు మళ్లీ కెమికల్స్ అంటూ కొత్త కథనాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ జరుగుతోందని, పూర్తి విచారణ అనంతరం నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. ల్యాబ్ రిపోర్టుల్లో ఎక్కడా కెమికల్స్ కలిపినట్టు లేదని స్పష్టం చేశారు. కెమికల్స్‌తో నెయ్యి తయారు చేయడం సాధ్యమా? అలాంటి నెయ్యితో లడ్డూ తయారుచేస్తే అది రెండు రోజులైనా నిలుస్తుందా? నెయ్యి వాసన, కెమికల్స్ వాసన తేడా తెలియదా? అంటూ ప్రశ్నించారు.

టీటీడీ స్వతంత్ర సంస్థ అని, ప్రభుత్వ జోక్యం ఉండదని, బెస్ట్ ప్రాక్టీసెస్‌ను అనుసరిస్తుందని తెలిపారు. తమ హయాంలో టీటీడీకి పూర్తి మద్దతు ఇచ్చామని, కల్తీ జరిగిందా లేదా అన్నది విచారణలో తేలాల్సిందేనని చెప్పారు. 2019 తర్వాత తమ పాలనలో బోలె బాబా ఎక్కడా సరఫరా చేయలేదని, ఆ సంస్థ బ్లాక్‌లిస్టులో ఉందని స్పష్టం చేశారు. బోలె బాబాకు అనుమతి ఇచ్చింది గత టీడీపీ ప్రభుత్వమేనని, శాంపిల్స్ కూడా ప్రస్తుత చంద్రబాబు పాలనలోనే తీసినవని గుర్తు చేశారు. జంతువుల కొవ్వు లేదని తేలిన తర్వాత కూడా ఇంకా కల్తీ జరిగిందంటూ విష ప్రచారం చేయడం దుర్మార్గమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Also Read:#Varanasi రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -