ఆంధ్రప్రదేశ్‌లో రైతుల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “రైతన్నా.. మీకోసం” పేరుతో నేటి నుంచి పది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, పంటల నిర్వహణ, దిగుబడి పెంపు వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించనున్నారు.
ఖరీఫ్ సీజన్‌కు ముందుగా రైతులు సరైన విధంగా సన్నద్ధం కావాలని లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులతో సమావేశాలు నిర్వహించి పంటల ఎంపిక, విత్తనాల నాణ్యత, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ వంటి అంశాలపై మార్గనిర్దేశం చేయనున్నారు.
వ్యవసాయాభివృద్ధికి దోహదపడే “పంచసూత్రాలు”ను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు వివరించనున్నారు. శాస్త్రీయ విధానాలతో సాగు చేయడం, నేల పరీక్షలు చేయించడం, నాణ్యమైన విత్తనాల వినియోగం, సమయానికి ఎరువులు వాడడం, పురుగుమందుల సరైన వినియోగం వంటి అంశాలను అధికారులు రైతులకు తెలియజేస్తారు.
ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పది రోజుల పాటు కొనసాగనుంది. చివరి రోజు జరిగే ముగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. రైతుల ఆదాయం పెంచడం, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం తెలిపింది.
Also Read:ఘనంగా కుల్దీప్ యాదవ్ వివాహాం

