ఏపీలో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. జగన్ ను గద్దె దించి 2014 ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తున్నారు మూడు పార్టీల అధినేతలు. ఇప్పటికే సీట్ల ప్రకటన కూడా చేసి ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజాగళం పేరుతో చిలకలూరిపేటలో ఇటీవల ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లతో పాటు ప్రధాని మోడీ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. సభలో భాగంగా వైసీపీని గద్దె దించడమే కూటమి లక్ష్యం అని ముగ్గురు అగ్రనేతలు మరోసారి స్పష్టం చేశారు అయితే ఈ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. .
గతంలో మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఆరోపణలు చేసిన బాబు.. నిన్నటి బహిరంగ సభలో ప్రధాని మోడీని ఆకాశానికెత్తారు. మోడీ ఒక వ్యక్తి కాదు శక్తి అని, దేశానికి ఆయన విశ్వగురువు అని ప్రశంశలు కురిపించారు. అంతే కాకుండా మోడీ అంటేనే అభివృద్ది, ఆత్మగౌరవం అని కొనియాడారు. ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి సంక్షేమనికి సరికొత్త నిర్వచనం చెప్పిన మోడీ.. తన పాలనతో దేశాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని అన్నారు చంద్రబాబు. అయితే 2019 ఎన్నికల ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరువాత మోడీని ఉగ్రవాదిగా పోల్చుతూ విమర్శించారు చంద్రబాబు నాయుడు.
మోడీ పాలనలో మతవిద్వేషాలు పెరుగుతున్నాయని, ఆయన పాలనలో దేశం సర్వనాశనం అవుతుందని గతంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన గత విమర్శలను, ప్రస్తుతం చేస్తున్న పొగడ్తలను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది వైసీపీ వర్గం. తన అవసరం కోసం రంగులు మార్చే వైఖరి బాబుది అని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read:బీజేపీపై ప్రకాశ్ రాజ్‌ఘాటు వ్యాఖ్యలు