దేశంలో మోదీ సర్కార్ ఆదరబాదరగా తీసుకువచ్చిన వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. తొలుత కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను దేశంలో దాదాపు 3 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు అయిన వైద్య సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది, పోలీసులకు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే హడావుడిగా టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన మోదీ సర్కార్ వాటి పనితీరుపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించడంలో విఫలమైంది. ముఖ్యంగా మూడవ దశ ట్రయల్స్‌లోనే కోవాగ్జిన్ టీకాకు మోదీ అనుమతులు ఇవ్వడం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. కోవిషీల్డ్‌తో పోలిస్తే కోవాగ్జిన్ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడంతో వైద్య సిబ్బంది సైతం దాన్ని తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు.
అయితే వ్యాక్సినేషన్ విషయంలో కేసీఆర్ సర్కార్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తెలంగాణ వైద్యశాఖ సమర్థవంతంగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్వహిస్తోందంటూ కేంద్రం కితాబు ఇచ్చింది..ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ఈ నెల 16వ తేదీ నుంచి టీకాల పంపిణీ మొదలైంది. 16వ తేదీ తొలిరోజు 140 కేంద్రాల్లో, రెండో రోజు (18వ తేదీ) 335 కేంద్రాల్లో టీకాలు వేశారు. మూడోరోజు మంగళవారం (19వ తేదీ) 894 కేంద్రాలకు విస్తరించారు. ఈ మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,625 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఎక్కువ శాతం మంది వైద్య సిబ్బంది ముందుకు వచ్చి టీకా వేయించుకోవడంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సంతృప్తి వ్యక్తం చేశారని రిజ్వీ చెప్పుకొచ్చారు. . ఈ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావుకు, డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డికి, వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్లకు రిజ్వీ అభినందనలు తెలిపారు. మొత్తంగా కేసీఆర్ సర్కార్‌పై కేంద్రం ప్రశంసలు కురిపించడం ఆసక్తికర పరిణామం.