ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షకు చేరువగా నిలిచిన తరుణంలో, ఇప్పటికీ నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నేటితో మూడో విడత లాక్ డౌన్ ముగియనుండగా, తాజాగా నాలుగో విడత లాక్ డౌన్ ప్రకటించారు. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన లాక్‌డౌన్ మార్గదర్శకాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లాక్‌డౌన్ మార్గదర్శకాలు ఇవే..
-దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులు నిలిపివేత.
-మెట్రో రైళ్లు, విద్యా, శిక్షణ సంస్థలు మే 31 వరకు బంద్.
-కొనసాగనున్న సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్ మూసివేత.
-స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, వినోద రెస్టారెంట్లు బంద్.
-ప్రేక్షకులు లేకుండా క్రీడా కేంద్రాలు, స్టేడియంలు తెరిచేందుకు అనుమతి
-కంటైన్మెంట్ జోన్లలో కాకుండా మిగిలిన అన్ని జోన్లలో అంతరాష్ట్ర బస్సు సర్వీసులు, సొంత వాహనాల ప్రయాణానికి అనుమతి.
-కంటైన్మెంట్ జోన్లలో నిత్యావసర, అత్యవసర వస్తువులకు అనుమతి.
-అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి.
-భౌతిక దూరం పాటిస్తూ 50 మంది అతిథులతో పెళ్లిళ్లకు అనుమతి.
-అన్ని రాష్ట్రాల మధ్య వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది ప్రయాణానికి అనుమతి.