హైదరాబాద్: కొవిడ్ సోకి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆసియా పవర్ లిఫ్టింగ్ మాజీ చాంపియన్ కె.జోసఫ్ జేమ్స్‌కు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రూ.2.50 లక్షలు ఆర్థిక సాయం అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాతో ఇబ్బందుల్లో ఉన్న తాజా, మాజీ క్రీడాకారులను ఆదుకోవడానికి క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ఒలింపిక్ సంఘం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి ఇటీవల తెలంగాణ నుంచి జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్‌రావును ప్రత్యేక ప్రతినిధులుగా నియమించింది.
హైదరాబాద్ కు చెందిన 55 ఏళ్ల జేమ్స్ కరోనాతో పోరాడుతున్న విషయం తెలుసుకున్న జగన్మోహన్‌రావు ఈ అంశాన్ని క్రీడా మంత్రిత్వశాఖ, ఐఓఏ, సాయ్ దృష్టికి తీసుకెళ్లారు. అతడి ఆర్థిక పరిస్థితిని క్రీడా మంత్రిత్వ శాఖ, ఐఓఏ, సాయ్‌కు తెలియజేసి రూ.2.50 లక్షలు సాయం అందించేందుకు కృషి చేశారు. తాజా, మాజీ క్రీడాకారులు, కోచ్‌లు ఎవరైన కొవిడ్ వల్ల ఇబ్బందుల్లో ఉంటే తక్షణమే తమని సంప్రదించాలని జగన్మోహన్‌రావు తెలిపారు.